Viral Pic: మనుషులు పెరుగుతున్నారు.. అవసరాలు పెరుగుతున్నాయి. ఇలాంటప్పుడు కొత్త రోడ్లు వేయడం, నూతన వంతెనలు నిర్మించడం, అధునాతన ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేయడం అనివార్యమవుతోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలలో రోడ్లను విస్తరించాలి అనుకున్నప్పుడు అటు ఇటు పక్కల ఉన్న భవనాలను తొలగించాల్సి వస్తోంది.. కోర్టు కేసులు, మన్నుమశానం వంటివి అడ్డు తగలకుంటే.. ప్రభుత్వాలు ఇలాంటి పనులను సులభంగానే చేయగలుగుతున్నాయి. ఇలా రోడ్లను విస్తరించకుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా అపారంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తున్నాయి. మనదేశంలో రోడ్డు విస్తరణ, లేక ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోర్టు కేసుల నుంచి మొదలు పెడితే స్థానికుల అభ్యంతరాల వరకు అన్నీ ఇబ్బందులే. అందువల్లే మనదేశంలో నేటికీ చాలా ప్రాంతాల్లో రోడ్లు విస్తరణకు నోచుకోలేదు.. ఇప్పుడంటే కొత్త కొత్త హైవేలు నిర్మాణమవుతున్నాయి. వంతెనలు ఏర్పాటవుతున్నాయి. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.
మన దేశం సంగతి పక్కన పెడితే.. నిర్మాణరంగంలో మన పొరుగున ఉన్న చైనా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అనితర సాధ్యమైన స్థాయిలో భవనాలను నిర్మిస్తోంది. సముద్ర జలాల మీదుగా వంతెనలు ఏర్పాటు చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన త్రీ గోర్జెస్ వంటి హైడల్ ప్రాజెక్టును నిర్మించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చైనా నిర్మాణ కౌశలం ఎంతో విస్తారమైనది.. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న ఆ దేశంలో కూడా రోడ్ల విస్తరణ లేదా నూతన వంతెన నిర్మాణంలో మన దేశం లాగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలా ఏర్పడిన ఓ ఇబ్బంది వంతెన నిర్మాణ ఆకృతిని పూర్తిగా మార్చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో ప్రకారం.. చైనాలో ఓ ప్రాంతంలో అతిపెద్ద వంతెన నిర్మించారు. ఆ వంతెన చూసేందుకు చాలా బాగుంది. అటు ఇటు నాలుగు లైన్ల వరుసతో నిర్మించిన రోడ్డుతో అధునాతనంగా కనిపిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఒక దగ్గర ఆ వంతెన ఆకృతి మలుపులు తిరిగింది. అక్కడ పర్వతాల వంటివి అడ్డుగా లేవు. సముద్రమో, నదులు ఆటంకం గా లేవు. అక్కడ ఆటకం కలిగించింది ఓ కుటుంబం. ఎందుకంటే ఆ వంతెన నిర్మించిన మార్గంలో ఒక కుటుంబం నివాసం ఉంటోంది. వంతెన నిర్మాణ క్రమంలో తమ ఇంటిని తొలగించేందుకు ఆ కుటుంబం ఒప్పుకోలేదు. అధికారులు బతిమిలాడినా ఆ కుటుంబం మెట్టు దిగలేదు. చివరికి చేసేది ఏమీ లేక అధికారులు ఆ ఇంటి దగ్గరికి వచ్చేసరికి వంతెన ఆకృతిని పూర్తిగా మార్చేశారు. వంతెన నిర్మించినప్పటికీ ఆ కుటుంబం ఆ ఇంట్లోనే నివాసం ఉంటోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇండియాలోనే కాదు ఎక్కడైనా సరే ఇలాంటి నిరసనకారులు ఉంటారు. కమ్యూనిస్టు ప్రభుత్వమయినప్పటికీ అలాంటి నిరసనకారుల ముందు చైనా తలవంచింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.