మొదలైన ట్రంప్ దబిడిదిబిడి! పిల్లల్ని చూసేందుకు అమెరికాకు వెళ్లితే ఎయిపోర్టులోనే..

ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే అమెరికాలో కాలుపెట్టాలనే విదేశీయులకు చిక్కులు మొదలయ్యాయి. తాజాగా ఓ భారతీయ దంపతులను అమెరికా ఎయిర్‌పోర్టు నుంచే స్వదేశానికి తిప్పి పంపేసిన ఘటన కలకలం రేపుతోంది.


రిటర్న్ టిక్కెట్ లేని కారణంగా వారికి ఈ ఊహించని పరిస్థితి ఎదురైంది. దీంతో, పరిస్థితులు భవిష్యత్తులో ఇంకెంత విపత్కరంగా మారతాయోనన్న భయం భారతీయుల్లో మొదలైంది (NRI).

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇటీవల ఓ జంట అమెరికాలో ఉంటున్న తన పిల్లల్ని చూసేందుకని అక్కడికి వెళ్లింది. అమెరికాలో ఐదు నెలల పాటు ఉండేందుకని వారు బీ-1/బీ-2 వీసాపై వెళ్లారు. కానీ, ఎయిర్‌పోర్టులోనే వారికి ఊహించని పరిస్థితి ఎదురైంది. అక్కడి అధికారులు వారిని తమ జర్నీకి సంబంధించిన రిటర్న్ టిక్కెట్లు చూపించమని కోరారు. తిరుగు ప్రయాణమయ్యేందుకు ముందస్తుగా టిక్కెట్స్ బుక్ చేసుకుని రాకపోతే అమెరికాలోకి అనుమతించేది లేదని అన్నారు. తమ ప్రయాణ వివరాలను ఆ జంట అధికారులకు కూలంకషంగా వివరించినా వారు వినిపించుకోలేదు. చివరకు వారు తమ పిల్లల్ని చూడకుండానే వెనక్కు తిరిగి రావాల్సి వచ్చింది.

ఈ ఉదంతం ప్రస్తుతం భారతీయుల్లో కలకలానికి దారి తీసింది. రిటర్న్ టిక్కెట్లు బుక్ చేసుకోవాలన్న నియమానికి సంబంధించి ముందస్తు సమాచారం ఏదీ లేదని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. దీంతో, ఎన్నారైల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎయిర్‌పోర్టులోని ఇమిగ్రేషన్ అధికారులు 2025 రెగ్యులేషన్స్‌ను ప్రస్తావిస్తున్నప్పటికీ ఈ కొత్త నిబంధనకు సంబంధించి బహిరంగ ప్రకటన ఏదీ లేకపోవడం అనేక మందిని అయోమయానికి గురి చేస్తోంది. దీంతో, భవిష్యత్తులో మరే కొత్త నిబంధనలు వస్తాయోనని అనేక మంది టెన్షన్ పడుతున్నారు. రెడిట్‌లో ఈ ఉదంతం వైరల్ అవగా అనేక మంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రయాణానికి ముందే తాజాగా నిబంధనలు ఏమిటో చెక్ చేసుకోవడం మంచిదని కొందరు అభిప్రాయపడ్డారు. ఇమిగ్రేషన్ నిబంధనలకు సంబంధించి అమెరికా ప్రభుత్వం మరింత స్పష్టతనివ్వాలని కొందరు డిమాండ్ చేశారు.