విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం గుడ్‌న్యూస్‌

ఆంధ్రప్రదేశ్‌కు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల సీఎంపీ కోసం నిధులు మంజూరు చేసింది కేంద్రం.. రెండు మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు ఐదేళ్లు దాటిపోవడంతో.. తిరిగి మరోసారి ప్లాన్ రూపొందించాలని కోరింది సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం.. అయితే, కేంద్రం సూచనలతో సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేసింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్.. రెండు నగరాల్లో సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూపకల్పన కోసం సిస్ట్ర ఎంవీఏ సంస్థ ఎంపిక చేశారు.. విశాఖలో 84.47 లక్షలు, విజయవాడలో 81.68 లక్షలతో ప్లాన్ రూపొందించనుంది సంస్థ.. ఆయా పనుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేసింది సెంట్రల్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్‌ విభాగం..


కాగా, విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.. విశాఖలో మొత్తంగా మూడు కారిడార్లలో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.. వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాదికి 34.4 కిలోమీటర్లు.. గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీసుకు 5.08 కిలో మీటర్లు.. తాడిచెట్ల పాలెం నుంచి చినవాల్తేర్ 6.75 కిలోమీటర్లు.. ఈ మూడు లైన్లు ఫేజ్ 1గాను కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కిలోమీటర్లు రెండవ ఫేజ్ లోనూ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. మొత్తం 76.9కిలోమీటర్లు మెట్రోరైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇక, విజయవాడలో 66.15 కిలోమీట్ల నిడివితో మెట్రో రైల్ ప్రాజెక్టు రాబోతోంది.. మొదటి ఫేజ్ లో 38.4 కిలోమీటర్లు, రెండవ ఫేజ్ లో 27.75 కిలోమీటర్లు మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు. ఇక, మొదటి ఫేజ్‌లో 1,152 కోట్ల రూపాయలతో భూసేకరణ చేయనుండగా.. రూ.11,009 కోట్లతో మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు. గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్‌.. పండిట్ నెహ్రూ బస్టాండ్‌ నుంచ పెనమలూరు, పండిట్ నెహ్రూ బస్టాండ్‌ నుంచి అమరావతికి ఇలా మూడు కారిడార్లలో విజయవాడ మెట్రో రైల్‌ నిర్మాణం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే..