అధిక బరువుతో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎంత ట్రై చేసినా బరువు తగ్గడం లేదని కంప్లైంట్స్ చేస్తుంటారు. అయితే మనం ఉదయంపూట తీసుకునే ఆహారాలు కూడా మనం బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
చాలా మంది అల్పాహారం మానేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల బరువు తగ్గడం కాదు.. పెరుగుతారు.
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనంగా చెబుతారు. ఉదయం తీసుకునే ఆహారంతోనే రోజంతా తాజాగా, ఉత్సాహంగా ఉంటారు. అల్పాహారం మానేయడానికి బదులుగా ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన భోజనం తినాలి. ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ రోజుకు శక్తిని అందిస్తుంది. అల్పాహారం మానేస్తే, ఆకలి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది బరువు పెరగడానికి దారితీయవచ్చు. బరువు తగ్గాలనుకుంటే మీ అల్పాహారంలో తప్పనిసరిగా చేర్చవలసిన ఆహారాలు ఏంటో తెలుసుకోండి.
బరువు తగ్గేందుకు ఓట్స్
ఓట్స్ బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తినడం వల్ల చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా అతిగా తినరు. ఇది మంచి జీర్ణక్రియను కూడా అందిస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. రుచికరమైన వోట్మీల్ తయారు చేసుకోవచ్చు. ఓట్స్ బరువు తగ్గడానికి, అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి.
ఇడ్లీ సాంబార్
ఇడ్లీ సాంబార్ చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది తినడానికి రుచిగా ఉండటమే కాకుండా చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ పుష్కలంగా దొరుకుతాయి. ఇడ్లీ సులభంగా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలిగా ఉండదు. సాంబార్ మరింత ఆరోగ్యంగా ఉండటానికి కూరగాయలను చేర్చుకోవచ్చు.
పప్పులు ఉండేలా చూసుకోండి
పప్పు తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో అంతే రుచికరంగా ఉంటుంది. ఇందులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉండటం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అల్పాహారంలో పప్పు ఉండేలా చూసుకోండి. అతిగా తినకుండా నిరోధిస్తుంది. దోసెలులాంటివి చేసుకోండి.
గుడ్లతో బరువు తగ్గొచ్చు
గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ అల్పాహారంగా ఉడికించిన గుడ్లు తినండి. ఉడకబెట్టిన గుడ్లు కాకుండా మీరు ఆమ్లెట్ లేదా ఎగ్ బుర్జీని కూడా తినవచ్చు. ఆమ్లెట్ లేదా బుర్జి చేసేటప్పుడు ఎక్కువ నూనెను వాడకూడదు. దీంతో మీరు బరువు పెరగవచ్చు. అల్పాహారం కోసం ఎగ్ శాండ్‌విచ్ ట్రై చేయండి.
పనీర్ ఎంతో బెటర్
పనీర్‌లో ప్రోటీన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా దొరుకుతాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే మీరు మీ అల్పాహారంలో పనీర్‌ను చేర్చుకోవచ్చు. అనేక రకాలుగా తినవచ్చు. పనీర్ శాండ్‌విచ్ లేదా పనీర్ బుర్జీని తినవచ్చు. మీరు అల్పాహారంగా పనీర్ తింటే చాలా లాభాలు ఉంటాయి. ఇది బరువు తగ్గడమే కాకుండా శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది.