ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రత్యేకమైన పాలనా వ్యవస్థను కలిగిన దేశాలలో భారత్ ఒకటి. పార్లమెంటరీ వ్యవస్థకు కట్టుబడి ఉన్న మన భారత ప్రభుత్వంలో..
రెండు పదవులు కీలకంగా ఉంటాయి. అందులో ఒకటి రాష్ట్రపతిది కాగా, మరొకటి ప్రధానమంత్రి పదవి. అయితే, రాష్ట్రపతి, ప్రధాన మంత్రి విధులు ఎలా ఉంటాయి? వీరి మధ్య తేడా ఏంటనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇవి రెండూ కీలక పదవులే అయినప్పటికీ వారి పాత్రలు, అధికారాలు, బాధ్యతలు భిన్నంగా ఉంటాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎన్నిక సైతం వేరుగా ఉంటుంది. మరి, ఈ రెండు పదవుల మధ్య ముఖ్యమైన తేడాలేంటో తెలుసుకుందాం.
* రాష్ట్రపతి VS ప్రధానమంత్రి
భారత రాష్ట్రపతిని దేశానికి అధిపతిగా, ప్రథమ పౌరుడిగా పిలుస్తారు. కార్యనిర్వాహక (Executive) శాఖకు రాష్ట్రపతి నామమాత్ర అధిపతిగా వ్యవహరిస్తారు. మరోవైపు, భారత ప్రధాన మంత్రి దేశ కేంద్ర మంత్రి మండలికి అధిపతి. ఎగ్జిక్యూటివ్ డిపార్ట్‌మెంట్‌కు హెడ్. పరిపాలనలో నిర్ణయాలు, వ్యూహాల అమలు, పర్యవేక్షణ, తదితర అంశాలపై పూర్తి బాధ్యత ప్రధానిదే. అయితే, భారత పరిపాలనకు సంబంధించిన విషయాలను రాష్ట్రపతికి ప్రధాని ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉండాలి.
* అర్హతలు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం.. రాష్ట్రపతి పదవికి అర్హత పొందేందుకు ఇండియన్ సిటిజన్‌కు అవసరమైన ప్రమాణాలను వివరిస్తుంది. మరోవైపు, ఆర్టికల్ 75, 84 కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులఅర్హత ప్రమాణాల గురించి వివరిస్తాయి. ఆర్టికల్ 74(1) ప్రధానమంత్రి, ఇతర మంత్రుల నియామక ప్రక్రియను వివరిస్తుంది. ఈ ఆర్టికల్ ప్రకారం.. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధాని సలహా, సిఫార్సు మేరకు మంత్రి మండలిలోని ఇతర మంత్రులను సైతం రాష్ట్రపతే నియమిస్తారు.
* అధికారాలు
భారత రాష్ట్రపతికి శాసన, కార్యనిర్వాహక, న్యాయపరమైన అధికారాలు ఉంటాయి. పార్లమెంటు ఆమోదించిన అన్ని చట్టాలను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. పార్లమెంటులో ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టడానికి కూడా ప్రెసిడెంట్ ఆమోదం తప్పనిసరి. భారత రాజ్యాంగాన్ని, చట్టాలను పరిరక్షించే బాధ్యత రాష్ట్రపతిదే. ప్రధాని, యూనియన్ మంత్రుల సలహా మేరకు యుద్దం ప్రకటించడం లేదా శాంతిని నెలకొల్పే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
* పరిపాలనా,శాసనాధికారులు..
భారత ప్రధాన మంత్రి కార్యనిర్వాహక, పరిపాలనా, శాసన అధికారాల వంటి ముఖ్యమైన అధికారాలను కలిగి ఉంటారు. ప్రభుత్వానికి నాయకత్వం వహించడంతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు బాధ్యతల కేటాయింపులో రాష్ట్రపతికి సహాయం చేస్తారు. అంతర్జాతీయ వేదికల్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తారు. చట్టాల రూపకల్పనలో నేతృత్వం వహించి పార్లమెంటులో లీడర్ ఆఫ్ ది హౌస్‌గా వ్యవహరిస్తారు..
* ఎన్నిక
రాష్ట్రపతి, ప్రధానమంత్రి అభ్యర్థులు తప్పనిసరిగా భారత పౌరులై ఉండాలి. రాష్ట్రపతికి 35 సంవత్సరాలు, ప్రధానమంత్రికి 25 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు ఎన్నికకు అర్హులు. రాష్ట్రపతి ఎన్నిక ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. లోక్‌సభలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ సిఫార్సు చేసిన ఎంపీని ప్రధానిగా రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధానమంత్రి కావాలంటే ఒక వ్యక్తి తన పదవీకాలం నుండి ఆరు నెలల లోపు పార్లమెంటు సభ్యుడు అయి ఉండాలి. ఎన్నికైన తర్వాత, వారు ఏదైనా ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకోవాలి.
* పదవీకాలం
రాష్ట్రపతి పదవీకాలం 5 ఏళ్లు ఉంటుంది. మరోవైపు, ప్రధాని పదవీకాలం నిర్దిష్టంగా ఉండదు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రధాని అభ్యర్థి సరైన బల నిరూపణ చేసుకోకపోతే పదవిని కోల్పోవడంతో పాటు ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది.