తక్షణ సందేశం పంపాలన్నా, ఫొటోలు పంచుకోవాలన్నా వెంటనే గుర్తుకు వచ్చే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ (WhatsApp). ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, అప్‌డేట్లను యూజర్లకు పరిచయం చేస్తుంటుందీ యాప్. నచ్చినట్టుగా చాట్ థీమ్, రంగులతో చాట్ బబుల్‌ను మార్చుకొనే కొత్త సదుపాయాన్ని తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
కొత్త ఫీచర్ సాయంతో యూజర్లు అనేక రకాల థీమ్‌లను తమ చాట్‌కు జోడించొచ్చు. ఇందులో 30 రకాల వాల్‌పేపర్ ఆప్షన్లు ఉన్నాయి. కావాలంటే మీ కెమెరాతో బంధించిన ఫొటోలనూ చాట్ థీమ్‌గా పెట్టుకోవచ్చు. అంతే కాదండోయ్ చాట్ బబుల్‌ని కూడా రంగుల్లో మార్చుకోవచ్చు. సాధారణంగా వాట్సప్‌లో మనం పెట్టే మెసేజ్‌లు ఆకుపచ్చ రంగుల్లో.. మనకు పంపే మెసేజ్‌లు తెలుపు రంగులో కనిపిస్తాయి. వీటిని కూడా మార్చుకోవచ్చు. అంటే ఇకపై వాట్సప్‌ని మీకు నచ్చిన రంగులతో నింపొచ్చన్నమాట. యూజర్ల అనుభవాన్ని మెరుగపరిచి, చాటింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది.
నచ్చితే అన్ని చాట్‌లకు ఒకే థీమ్ పెట్టుకోవచ్చు. లేదంటే నచ్చిన వ్యక్తుల చాట్‌లకు మాత్రమే థీమ్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఈ థీమ్ మీకు మాత్రమే కనిపిస్తుందనే విషయం గుర్తుంచుకోండి. వాట్సప్ ఛానల్ నిర్వహిస్తున్నవారు కూడా ఈ ఫీచర్‌ని వినియోగించుకోవచ్చు. Settings>Chats>Default chat theme ని ఎంచుకొని ఈ థీమ్‌ని ఛేంజ్ చేయొచ్చు. ఇప్పటికే వాట్సప్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యాప్‌ని అప్‌డేట్ చేసుకొని మీరు కూడా దీనిని ట్రై చేయండి.