ఏపీలో ( Andhra Pradesh) విద్యాసంస్థలు ఈరోజు తెరుచుకున్నాయి. ఏప్రిల్ 24 న అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం వేసవి సెలవులు ఇచ్చింది. సుమారు 50 రోజుల అనంతరం ఈరోజు పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు నుంచి కొత్త విద్యా సంవత్సరం కూడా ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సంస్కరణలను అమలు చేస్తోంది. విద్యార్థులకు యూనిఫామ్ తో పాటు పాఠ్య, నోట్ పుస్తకాలతో కూడిన విద్యా మిత్ర కిట్లను అందజేస్తోంది. ఈరోజు నుంచి మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా సన్న బియ్యంతో కూడిన ఆహారం అందించనున్నారు. ఇప్పటికే ప్రాంతాలవారీగా ఆహారాన్ని మెనూలో పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వ విద్య బలోపేతం..
ప్రభుత్వ విద్యను( Government education) బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పని చేస్తోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా నారా లోకేష్ విద్యా శాఖ మంత్రి అయిన తర్వాత చాలా రకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ కానున్నాయి. మరోవైపు ప్రతి శనివారం కచ్చితంగా నో బ్యాగ్ డే గా అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్ అందించనున్నారు. ప్రతిరోజు విద్యార్థి పాఠశాలకు వెళ్లేందుకు రవాణా భత్యం అందించనుంది కూటమి ప్రభుత్వం. ఏపీలో పాఠశాలలను మూడు విభాగాలుగా విభజించారు. బేసిక్, ఫౌండేషనల్, ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా విభజన చేశారు.
మూడు రకాలుగా విభజన..
ఐదు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. మూడు రకాలుగా విభజించిన పాఠశాలలు ఊరికి దూరంగా ఉంటాయి. ఆరు నుంచి ఎనిమిది తరగతులు ఉండే స్కూళ్లు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అయితే అంతకంటే ఎక్కువగా ఉంటే ప్రభుత్వం రవాణా ఖర్చుల( travelling charges) కోసం డబ్బులు ఇస్తుంది. ఇక్కడ దూరాన్ని బట్టి ప్రభుత్వం ఏడాదికి పది నెలల పాటు రవాణా భత్యం అందించనుంది. ఈ భత్యాన్ని నేరుగా తల్లుల ఖాతాలో జమ చేస్తారని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది కూడా ప్రభుత్వం రవాణా చార్జీలను విడుదల చేసింది.
విద్యా హక్కు చట్టం ప్రకారం..
విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్ణీత దూరంలో పాఠశాలలు లేకపోతే… ఇంటి నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్ చెల్లించాలి. వాస్తవానికి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాల కిలోమీటర్ దూరం, ప్రాథమికోన్నత పాఠశాల మూడు కిలోమీటర్ల దూరం, ఉన్నత పాఠశాల 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. అంతకుమించి దూరం ఉంటే మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ట్రావెల్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఇంటికి దూరంగా ఉన్న పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులకు గత ఏడాది రవాణా చార్జీల కింద నిధులు విడుదలయ్యాయి. ఒక్కో విద్యార్థికి గరిష్టంగా 6000 రూపాయల చొప్పున ఈ భత్యాన్ని చెల్లించారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా అందించేందుకు నిర్ణయించారు.