ఒక్కరు.. ఇద్దరు కాదు.. భర్తలను మార్చడంలో ఆఫ్ సెంచరీ కొట్టిన మాయలేడీ.. లిస్ట్‌లో ప్రముఖులు..

పెళ్లంటే నూరేళ్ల పంట.. మ్యారేజెస్‌ మేడిన్‌ హెవన్‌ అంటారు. ఒక్కసారి మూడు ముళ్లు పడితే జీవితాంతం ఒకరి కోసం ఒకరు బతకడమే పెళ్లంటే.. కానీ ఈమెకు మాత్రం మ్యారేజెస్ అంటే మూడునాళ్ల ముచ్చటే.


తలంబ్రాలు పోయించుకున్నామా.. డబ్బు, నగలతో ఉడాయించామా అన్నట్టుగా సాగిస్తోందీ కిలాడీ లేడీ. వాట్సాప్‌లో డీపీ మార్చినంత ఈజీగా.. డ్రస్ మార్చేసినంత సులభంగా భర్తలను మార్చేస్తూ ఎందరో జీవితాలతో ఆడుకుంది ఈ మాయలేడి.. రెండో పెళ్లి చేసుకుంటేనే దొరికిపోతున్న ఈ రోజుల్లో నలభై పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకోవడం సాధ్యమా? అంటే సాధ్యమేనంటుంది ఈ నిత్య పెళ్లకూతురు. ఏకంగా నలభై మందిని పెళ్లి చేసుకుని చివరకు పోలీసుల చేతికి చిక్కింది. ఈ దారుణం తమినాడులో జరిగింది.

తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్‌సైట్‌లో సంధ్య అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. లగ్నకోటి రాసుకొని మరీ దండలు మార్చుకున్నారు. లగ్గమైంది. కాపురం పెట్టారు. అంతా సాఫీగా సాగుతోందనే టైమ్‌లో ఒక్కసారిగా కిరికిరి. పెళ్లయిన మూడు నెలలు కూడా కాకుండానే ఆమె ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది.

అనుమానం వచ్చిన ఆ యువకుడు.. సంధ్య ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది. ఇదేంటని ప్రశ్నిస్తే చంపేస్తానంటూ భర్తను బెదిరించింది. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. సంధ్యను అదుపులో తీసుకుని విచారిస్తే అసలు యవ్వారం బయటపడింది.

ఆమెకు 50 కంటే ఎక్కువ మందితో పెళ్లైందని విచారణలో తేలింది. ఒక డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా ఆమె బాధితుల లిస్ట్‌లో ఉన్నారని తేలింది.

సంధ్య ఇప్పటివరకు 39 పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణలో బయటపడిందని పోలీసులు తెలిపారు. అయితే.. సంధ్య విషయం తెలిసి.. పోలీసులే అవాక్కవుతున్నారు. మొత్తం మీద ఇంత మందిని మోసం చేసిన ఈ మహిళను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.