Shawarma Food Poison: షావర్మా తిని ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నారు ఎందుకు?

www.mannamweb.com


Shawarma Food Poison: ఇటీవల ముంబై కి చెందిన ఒక యువకుడు రోడ్డు పక్కన ఉన్న షావర్మా తిన్నాడు. ఆ తర్వాత అనారోగ్యానికి గురై మరణించాడు. గతంలో కేరళలో కూడా ఇలాగే జరిగింది. షావర్మా తినడం వల్ల ఎక్కువమంది అనారోగ్యం పాలవుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో వైద్యులు వివరిస్తున్నారు.

షావర్మా ఎందుకు ప్రమాదకరం?
షావర్మా తినడం వల్ల కొంతమంది ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారు. ఆ కలుషితమైన ఆహారం తినడం వల్ల వ్యక్తులు అనారోగ్యాలకి గురవుతున్నారు. తీవ్రమైన జ్వరం, వికారం, వాంతులు, విరేచనాలు, పొట్టనొప్పి వంటి వాటి బారిన పడి మరణించిన వారు కూడా ఉన్నారు. బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్న జీవులు ఆహారంపై నిల్వ ఉండడం వల్ల… వాటిని తిన్నవారు ఇలా తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు.

షావర్మాలో చెడు బ్యాక్టీరియా త్వరగా చేరిపోతుంది. మాంసం అపరిశుభ్రంగా ఉన్నా కూడా బ్యాక్టీరియా అక్కడ సులువుగా నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. సరిగా ఉడకని మాంసంలో కూడా బ్యాక్టీరియాలు అధికంగా ఉంటాయి. అలాగే రోడ్డుమీద నుంచి వచ్చే కాలుష్యం కూడా ఆ మాంసంపై చేరి వ్యాధికారకాలను పెంచుతాయి. వండేటప్పుడు పచ్చి మాంసాన్ని ముక్కలుగా కోసి మంటపై ఇనుప తీగకు గుచ్చి వండుతారు. సరైన పరిశుభ్రత పాటించకుండా వండితే బ్యాక్టీరియాలు అందులో చేరిపోతాయి.

మాంసంలో బ్యాక్టీరియా పెరగకుండా ఉండాలంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద వండాలి. కానీ షావర్మా వండినప్పుడు మాంసాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించరు. దీని వల్ల కూడా సాల్మొనెల్లా, ఈ. కోలి, క్యాంపిలో బాక్టర్ వంటి హానికరమైన బ్యాక్టీరియా వృద్ది చెందుతుంది.

వండేటప్పుడు చేతులు శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా ఇతర బ్యాక్టీరియాలు షావర్మాపై చేరుతాయి ఈ షావర్మాలు ఏ రోజు వండినవి ఆరోజు అమ్ముడు పోకపోతే మరుసటి రోజు కూడా వాటినే మంటపై పెట్టి కాల్చి తిరిగి అమ్ముతూ ఉంటారు. ఇలా కూడా ఆహారం విషంగా మారిపోతుంది. ఏ మాంసాన్నైనా అందులో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను చంపాలంటే అధిక ఉష్ణోగ్రత వద్ద వండాలి. అప్పుడే అది తినడానికి వీలైనది. కాబట్టి ఇలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వండే షావర్మాల జోలికి వెళ్లకపోవడమే మంచిది.