Yashavi Jaiswal: యశస్విపై ప్రశంసలు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా రికార్డు

www.mannamweb.com


భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ (Yashsavi Jaiswal) డబుల్‌ సెంచరీ చేసి,.. ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక సిరీస్‌లో 20+ సిక్స్‌లు బాదిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. అలాగే ఒకే ఇన్నింగ్స్‌లో 12 సిక్సులు కొట్టి పాక్‌ దిగ్గజ క్రికెటర్ వసీమ్‌ అక్రమ్‌తో కలిసి సంయుక్తంగా యశస్వి అగ్రస్థానంలో ఉన్నాడు. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్‌ 434 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.

‘‘డబుల్‌ సెంచరీ, డబుల్‌ ఫిఫ్టీ.. యశస్వి-సర్ఫరాజ్‌ ఖాన్ జోడీ అదరగొట్టేసింది. ఇంగ్లాండ్‌కు డబుల్‌ ట్రబుల్‌గా నిలిచింది. నేను వారిద్దరి ఇన్నింగ్స్‌లను మొత్తం లైవ్‌లో చూడలేకపోయా. కానీ, వారి ఆటతీరును చెబుతుంటే విన్నా. ఇలాగే కొనసాగాలి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణించిన టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. కంగ్రాట్స్‌..’’ – సచిన్‌ తెందూల్కర్

‘‘యశస్వీ…. జై…స్వాల్‌.. సూపర్ బ్యాటింగ్‌. సర్ఫరాజ్‌ ఖాన్‌ కూడా జైస్వాల్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మా శుక్లా గారికి చెబుతుంటా.. ఈ అబ్బాయి (యశస్వి) నాకు తెలుసు.. చాలా గట్టిగా ఆడతాడు’’ – సూర్యకుమార్‌ యాదవ్

‘‘అద్భుతమైన విజయం. యశస్వి ఆరంభం ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే అడుగులు వేస్తున్నాడు. అతడి సత్తాకు ఆకాశమే హద్దు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టీమ్‌ఇండియా గెలిచింది. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది’’ – వీరేంద్ర సెహ్వాగ్

‘‘భారీ తేడాతో విజయం సాధించడం అభినందనీయం. భారత క్రికెట్‌ చరిత్రలో ఇదే అత్యధికం. ఇలాంటి గెలుపు వల్ల మిగతా మ్యాచుల్లో ఒత్తిడి ఎక్కువైనా సరే భారత్‌ దానిని తట్టుకోగలదు. 33/3 స్కోరుతో తొలి రోజులో వెనుకబడినా.. ఇంగ్లాండ్‌ 200/2 స్కోరుతో ముందంజ వేసినా కంగారు పడలేదు. ప్రతి దశలోనే ఒక హీరో వచ్చి టీమ్‌ఇండియాను కాపాడాడు’’ – వసీమ్‌ జాఫర్

‘‘ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ను యశస్వి బాగా అందుకొన్నాడు. అద్భుతంగా ఆడటం అలవాటు చేసుకున్నాడు. బెన్‌ డకెట్‌ను ధ్రువ్‌ రనౌట్‌ చేయడమే మ్యాచ్‌కు హైలైట్‌’’ – ఇర్ఫాన్‌ పఠాన్‌