Ys Jagan : స్పీకర్ కు లేఖ రాసిన జగన్.. ముందుగానే నిర్ణయించుకున్నారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. అందులో ప్రతిపక్ష హోదా తమకు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నారా?


అని ఆయన లేఖలో ప్రశ్నించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఇది చేస్తున్నట్లుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం అంటేనే అర్ధమవుతుందన్నారు. ఇది సంప్రదాయాలకు విరుద్ధమని తెలిపారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా చెబుతుందని, అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని ఆయన తెలిపారు.

ఏ సభలోనైనా…ఏ చట్ట సభలోనైనా ఇదే నిబంధన వర్తిస్తుందని జగన్ లేఖలో పేర్కన్నారు. పార్లమెంటులోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ నిబంధన ఇప్పటి వరకూ ఎవరూ పాటించలేదని పేర్కొన్నారు. అధికార కూటమి, స్పీకర్ తన పట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అర్థమయిందని, చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు బయటకు వచ్చాయని ఆయన లేఖలో తెలిపారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజాసమస్యలు బలంగా వినిపించే అవకాశముంటుందని జగన్ లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ప్రతిపక్ష హోదా విషయంలో తన అభ్యర్థనను పరిశీలించాలని జగన్ లేఖలో స్పీకర్ ను కోరారు.