లోయలో పడిన బస్సు 22 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో గురువారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు జమ్మూ జిల్లాలో అదుపు తప్పి దాదాపు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోవడంతో 22 మంది దుర్మరణం చెందారు. మరో 57 మంది గాయాలపాలయ్యాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని అఖ్నూర్‌ ప్రాంతం చౌకీ చోరా బెల్ట్‌లోని తుంగి-మోర్‌ వద్ద మధ్యాహ్నం 12.35 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


ఈ బస్సు హరియాణాలోని కురుక్షేత్ర నుంచి భక్తులను తీసుకుని జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లా పౌనీ ప్రాంతంలో ఉన్న శివ్‌ ఖోరి వైపు వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌ నుంచి ఈ బస్సు ప్రయాణం మొదలైంది. ప్రమాదం జరిగిన ట్టు తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను అఖ్నూర్‌ సబ్‌ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రులను జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)కు తరలించినట్టు చెప్పారు.

బాధితుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారేనని తెలిపారు. ఆర్మీ, పోలీసులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మానవహారంగా ఏర్పడి మరణించిన వారితోపాటు క్షతగాత్రులను పైకి తీసుకువచ్చారు. లోయలోనుంచి బస్సును బయటకు తీయడానికి ఆర్మీ క్రేన్లను వినియోగించిందని తెలిపారు. మూలమలుపులో ఎదురుగా వస్తున్న కారును తప్పించే ప్రయత్నంలో డ్రైవర్‌ విఫలంకావడంతో బస్సు లోయలో పడిందని గాయపడిన ప్రయాణికులు తెలిపారు.

ఈ విషాద ఘటన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రమాదంలో ప్రాణనష్టం గురించి తెలిసి చెప్పలేనంత బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ‘ఎక్స్‌’లో ముర్ము పోస్ట్‌ చేశారు. ఈ ప్రమాద ఘటనపై జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదం హృదయవిదారకంగా ఉందని, ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.