మీ జీవితాన్ని మార్చే 5 శక్తివంతమైన అలవాట్లు

జీవితంలో ఏదో సాధించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొన్నిసార్లు పక్కా ప్లానింగ్ ప్రకారమే ముందుకెళ్లినా విజయం ముంగిట బోల్తా పడతుంటారు. లేకపోతే లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఉండిపోతారు. అయితే, సాయంత్రం దినచర్యలో ఈ 5 పనులను భాగం చేసుకున్నారంటే మాత్రం మీకిక తిరుగుండదు.


ప్రతి ఒక్కరూ అద్భుతమైన, సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు. తమ ఆకాంక్షలు, లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తారు. కానీ, సాయంత్రం కాగానే తరచూ అందరూ టీవీ లేదా ఫోన్ చూడటం లేదా అలసిపోయి ఏమీ చేయకుండా ఉండటం వంటివి చేసి సమయం వృథా చేస్తుంటారు. ఇందుకు బదులుగా ప్రతి సాయంత్రం ఈ 5 పనులు చేయడం అలవాటు చేసుకుంటే మీ జీవితమే పూర్తిగా మారిపోతుంది. మీ ఆలోచన, ఆరోగ్యం, జీవనశైలిలో అద్భుతమైన మార్పులు తెచ్చి సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా తీర్చిదిద్దుతుంది. మీ విజయానికి నిచ్చెనగా మారే ఆ 5 అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆత్మపరిశీలన

ప్రతి సాయంత్రం అన్ని వ్యాపకాలను పక్కనపెట్టి 10-15 నిమిషాల పాటు మౌనంగా ఒక చోట కూర్చోండి. ఆ రోజు ఎలా గడిచిందో ఆలోచించండి. నిద్ర మేల్కొన్నప్పటి నుంచి ఏం చేశారు? ఏ పని బాగా చేసారు? ఏ తప్పులు చేసారు? వాటి నుంచి ఏమి నేర్చుకున్నారు? ఇలా మిమ్మల్మి మీరే ప్రశ్నించుకోండి. ఇలా ప్రశాంతమైన మనస్సుతో కూర్చుని ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు మీ బలాలు, బలహీనతల గురించి క్లారిటీ వస్తుంది. స్వీయ-అవగాహన పొందడం ద్వారా భవిష్యత్తులో చేయబోయే పనుల్లో తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడతారు. ఒత్తిడి తగ్గి జీవితంలో సానుకూలంగా ముందుకు సాగడానికి ఈ అలవాటు సహాయపడుతుంది.

మరుసటి రోజు కోసం ప్లానింగ్

ఈ రోజు, ఈ క్షణం మీరు చేసే పని, తీసుకున్న నిర్ణయాలే మీ విజయంలో, పరాజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. చిన్నదో, పెద్దదో ఏదైనా రేపు చేయాల్సిన పని గురించి ఇవాళే ప్లాన్ చేసుకుంటే సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఎదుగుతారు. కాబట్టి, మరుసటి రోజు చేయవలసిన పనుల జాబితాను రాత్రి పడుకునే రెండు, మూడు గంటల ముందే తయారు చేసుకోండి. దీని వలన ఉదయం మీ సమయం వృథా కాదు. తర్వాతి రోజును స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభించగలుగుతారు. ఈ అలవాటు మీ పనిలో ఏకాగ్రతని, ఉత్పాదకతని రెండింటినీ పెంచుతుంది.

సాయంత్రం డిజిటల్ డీటాక్స్

నేటి కాలంలో మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. ఆఫీసులో ఎక్కువ భాగం ల్యాప్‌టాప్, మొబైల్‌లో మాత్రమే పని చేయాల్సి వస్తుంది. ఏ పని చేయని వారూ మొబైల్ ఫోన్‌లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కానీ వాటిని రోజూ కొంతసేపు దూరం పెట్టడం అవసరం. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. నిద్రపోవడానికి కనీసం 1 గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టీవీకి దూరంగా ఉండండి. బదులుగా ధ్యానం చేయండి లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడండి. మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. ఈ పనుల వల్ల త్వరగా నిద్రపట్టడమే కాదు. టెన్షన్ తగ్గి మానసిక ప్రశాంతత పొందుతారు.

శరీరానికి సమయం

రోజంతా పని చేశాక అలసిన శరీరానికి విశ్రాంతి అవసరం. ముఖ్యంగా, సాయంత్రం పూట శరీరం కోసం కొంత సమయం కేటాయించండి. ఈ సమయంలో తేలికపాటి స్ట్రెచింగ్, యోగా లేదా వాకింగ్ చేయవచ్చు. ఇది శరీర అలసటను తొలగించి మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. మీరు బాగా నిద్రపోయినప్పుడే మరుసటి రోజును ఉత్సాహంగా ప్రారంభించగలరు.

పుస్తక పఠనం

మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి పుస్తక పఠనం కంటే మంచి మార్గం మరొకటి లేదు. కాబట్టి, ప్రతి రాత్రి పడుకునే ముందు మీకు ఇష్టమైన పుస్తకాన్ని కాసేపు చదవండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. మీకు ఏ సబ్టెక్ట్ ఇష్టం ఉంటే ఆ పుస్తకాలు ఎంపిక చేసుకోండి. ఫిక్షన్, నాన్-ఫిక్షన్, ఆధ్యాత్మికం, మోటివేషన్ ఇలా జోనర్ అయినా సరే. నిద్రపోయే ముందు పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి.