వన్‌ప్లస్ గ్యాడ్జెట్స్ ఇక నుంచి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు తమ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నట్టు సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రీటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ) ప్రకటించింది.
వన్‌ప్లస్ లవర్స్‌కి గుడ్ న్యూస్! దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్- సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రీటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ) మధ్య ఉన్న వివాదాలు తొలగిపోయాయి. లో- మార్జిన్ సహా తమ మధ్య ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకున్నట్టు ఓఆర్ఏ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది.
“నిర్మాణాత్మక చర్చలు, పరస్పర సహకారంతో ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న సమస్యలను మేము పరిష్కరించుకున్నాము. ఫలితంగా వన్‌ప్లస్‌తో తాత్కాలికంగా ఉన్న సమస్యలు తొలగిపోయాయి. వన్‌ప్లస్ సంస్థతో కొలాబొరేషన్ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నాము,” అని ఆర్గనైజ్డ్ రీటైలర్స్ అసోసియేషన్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది.
తాజా పరిణామాల కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఓఆర్ఏ సభ్యులు ఇక నుంచి వన్‌ప్లస్ ప్రాడక్ట్స్‌ని కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. కస్టమర్లు ఓఆర్ఏ నెట్వర్క్ ద్వారా వన్‌ప్లస్ గ్యాడ్జెట్స్‌ని కొనుగోలు చేసుకోవచ్చు.
పండగ సీజన్ సమయంలో రీటైలై స్టోర్స్‌లో వన్‌ప్లస్ సేల్స్ రీస్టార్ట్ అవుతుండటం వ్యాపారులకు, కస్టమర్స్‌కి మంచి విషయంగా భావిస్తున్నారు. ఇది కస్టమర్స్‌కి, రీటైలర్లకు, వన్‌ప్లస్ పార్ట్నర్స్కి భారీగా లబ్ధిచేకూరుస్తుందని ఓఆర్ఏ ఆశాభావం వ్యక్తం చేసింది.
” మా సభ్యులు, కస్టమర్స్‌కి సేవలందించేందుకు, మా పార్ట్‌నర్స్‌తో బంధం బలోపేతం చేసుకునేందుకు ఓఆర్ఏ నిత్యం కృషిచేస్తుంది. వన్‌ప్లస్‌తో బంధం మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాము,” అని సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రీటైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టీ.ఎస్ శ్రీధర తెలిపారు.
ఇదీ సమస్య..
వన్‌ప్లస్ ప్రాడక్ట్స్ ఆఫ్‌లైన్ సేల్స్‌ని బహిష్కరించాలని ఈ ఏడాది తొలినాళ్లల్లో ఓఆర్ఏ కీలక నిర్ణయం తీసుకుంది. మార్జిన్లు తక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణం. సర్వీస్ క్లెయిమ్స్, వారెంటీలను వన్‌ప్లస్ సంస్థ ఆలస్యం చేస్తుండటం కూడా ఓఆర్ఏకి నచ్చలేదు.
దేశవ్యాప్తంగా ఉన్న 4500 స్టోర్స్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్, వాచ్‌లు ఇతర గ్యాడ్జెట్స్ సేల్స్‌ని 2024 మే 1 నుంచి నిలిపివేస్తున్నట్టు ఓఆర్ఏ గతంలో ప్రకటించింది. ఈ స్టోర్స్ ఇవి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలో అధికంగా ఉన్నాయి.
ఏడాది కాలంగా ప్రత్యేకంగా వన్‌ప్లస్ ప్రాడక్ట్స్తో సమస్యలు ఎదురుతున్నాయని ఓఆర్ఏ గతంలో వెల్లడించింది. సమస్యలను పరిష్కరించేందుకు వన్‌ప్లస్ ముందుకు రావడం లేదని, అందుకే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
రీటైల్ స్టోర్స్‌లో వన్‌ప్లస్ ప్రాడక్ట్స్ లభించకపోవడంతో చాలా మంది అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లలో కొనుగోళ్లు చేసుకోవాల్సి వచ్చింది.