మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మరో కీలక ముందడుగు పడింది. భారత వైమానిక దళంలో కీలకంగా వ్యవహరిస్తున్న రఫేల్ యుద్ధవిమానాల తయారీకి సంబంధించి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్, ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్ సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. రఫేల్ యుద్ధవిమానాలకు చెందిన ప్రధాన భాగాలు హైదరాబాద్‌లోని టీఏఎస్‌ఎల్‌లో తయారు చేయాలని ఇరు సంస్థలు ఒప్పందానికి వచ్చాయి. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు ఫ్రాన్స్‌కు వెలుపల తయారు కావడం ఇదే తొలిసారి. ఏరోస్పేస్ రంగంలో భారత్ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని చెప్పడానికి తాజా ఒప్పందాన్ని ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. యుద్ధవిమానాల తయారీలో మరింత వేగం పెంచేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది.
2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఫ్యూజ్‌లేజ్ అసెంబ్లింగ్ లైన్, ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థ ఏర్పాట్లు చేయనుంది. నెలకు రెండు ఫ్యూజ్‌లేజ్‌లను అందించనున్నారు. ‘‘ భారత్‌లో మా ఉత్పత్తిని బలోపేతం చేయడంలో ఇది నిర్ణయాత్మక అడుగు. భారత రక్షణ రంగంలో మా సేవలను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ నిర్ణయం రఫేల్ విస్తరణకు మరింత దోహదం చేస్తుంది. అంతేకాకుండా నాణ్యమైన సేవలు అందిస్తూ.. సైనిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుంది’’ అని డసో ఏవియేషన్ ఛైర్మన్ అండ్ సీఈవో ఎరిక్ ట్రాపియర్ పేర్కొన్నారు.
భారత రక్షణ రంగ చరిత్రలో ఈ ఒప్పందం ఓ మైలురాయిగా నిలుస్తుందని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఎండీ సుకరన్ సింగ్ తెలిపారు. డసో ఏవియేషన్ సంస్థతో చేసుకున్న ఈ ఒప్పందం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సామర్థ్యాలను గుర్తు చేస్తుందన్నారు. భారతదేశ వైమానిక వ్యవస్థ అభివృద్ధి, పురోగతిని ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందని సుకరన్ సింగ్ పేర్కొన్నారు.
































