చింత చిగురుతో చేసే వంటలంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా పప్పు సహా చికెన్, మటన్, రొయ్యల వంటి వంటల్లో వేసుకుని తింటుంటారు. రుచితోపాటు ఔషధ గుణాలు కూడా ఇందులో అధికంగా ఉంటాయి. అయితే చింతచిగురుతో ఎప్పుడూ చేసేది కాకుండా ఓసారి ఇలా పచ్చడి చేయండి. పుల్లగా, కారంగా ఉండి తినేకొద్దీ తినాలనిపిస్తుంది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే అమృతమే. టిఫెన్స్లోకీ పర్ఫెక్ట్. పైగా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి లేట్ చేయకుండా సూపర్ టేస్టీ చింతచిగురు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- చింతచిగురు – 150 గ్రాములు
- నువ్వులు – 3 టేబుల్‌స్పూన్లు
- నూనె – 2 టీస్పూన్లు
- ఎండుమిర్చి – 20
- ఉప్పు – సరిపడా
- జీలకర్ర – అర టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు – 6
తాలింపు కోసం:
- నూనె – 4 టేబుల్‌స్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు – 6
- జీలకర్ర – అర టీస్పూన్
- ఆవాలు – అర టీస్పూన్
- ఎండుమిర్చి – 3
- కరివేపాకు – గుప్పెడు
- ఇంగువ – చిటికెడు
తయారీ విధానం:
- ముందుగా చింతచిగురు శుభ్రం చేసుకోవాలి. లేతది అయితే కాడలతో సహా పచ్చడి చేసుకోవచ్చు. అదే కాస్త ముదిరిపోయిన కాడలు ఉంటే తీసేసి కడిగి నీళ్లు వడకట్టుకోవాలి. అందుకోసం జల్లెడలో వేసి పక్కన పెట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నువ్వులు వేసి లో ఫ్లేమ్‌లో కాస్త దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి.
- అదే పాన్‌లో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత తొడిమలు తీసేసిన ఎండుమిర్చి వేసి సిమ్‌లో ఎర్రగా వేయించుకుని తీసి పక్కన పెట్టాలి.
- అదే కడాయిలో మరో టేబుల్‌స్పూన్ నూనె వేసి కడిగి పెట్టుకున్న చింతచిగురు వేసి లో ఫ్లేమ్‌లో కలుపుతూ మగ్గించుకోవాలి.
- చిగురు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
- మిక్సీజార్‌లోకి వేయించిన నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు మెత్తగా గ్రైండ్ చేయాలి.
- ఆ తర్వాత అందులోకి మగ్గించిన చింతచిగురు, కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా రుబ్బుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి.
-
- ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించాలి.
- చివరగా ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ తాలింపు మిశ్రమాన్ని రుబ్బుకున్న పచ్చడిలో కలిపితే పుల్లగా కారంగా ఉండే కమ్మని చింతచిగురు పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
చిట్కాలు:
- ఈ పచ్చడికి ఎండు కారం అయితేనే బాగుంటుంది. అయితే ఇక్కడ మీరు తినే కారానికి సరిపడా ఎండు మిరపకాయలు తీసుకోవాలి. కానీ పచ్చడి కాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది.
- నువ్వులు బదులు పల్లీలు కూడా తీసుకోవచ్చు. నువ్వులను యాడ్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది.
- ఈ పచ్చడి టిఫెన్స్లోకి సూట్ అవుతుంది. అన్నంలో తినాలనుకుంటే మాత్రం పచ్చడిలో కాసిన్ని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కలుపుకుని తింటే చాలు.
- ఈ పచ్చడి బయట ఉంచితే మూడు రోజులు, ఫ్రిజ్‌లో అయితే వారం పైనే నిల్వ ఉంటుంది.