తెలంగాణ బీజేపీలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అందజేశారు.’బీజేపీ గెలవకూడదనుకునే వాళ్లు పార్టీలో ఎక్కువయ్యారు.
అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చాను. నా మద్దతుదారులను బెదిరించారు’అని రాజాసింగ్ ఆరోపించారు. బాధాతప్త హృదయంతో తాను బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుని తాను ఈ రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు.
రామచంద్రరావు నియామకంపై రాజా సింగ్ గుర్రు
అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతున్నది. నావాడు, నీవాడు అంటూ అధ్యక్షుడిని నియమించుకుంటూ పోతే పార్టీకే తీవ్ర నష్టం’అని ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పుకొచ్చారు. ‘అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటేసి ఎన్నుకోవాలి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎన్నిక నిర్వహించాలి’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
































