పురిటినొప్పులు భరించలేక.. పొత్తికడుపు కోసుకుని!

పురిటి నొప్పులు తాళలేక ఓ నిండు గర్భిణి కత్తితో పొత్తికడుపును కోసుకున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో చోటుచేసుకుంది. అనంతరం ఆస్పత్రిలో ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన మహిళ (35)కు గురువారం పురిటి నొప్పులు వచ్చాయి. అవి భరించలేక ఆమె పొత్తికడుపును వంటింట్లో ఉపయోగించే కత్తితో కోసుకున్నారు. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆమె అరుపులు విని అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.


అక్కడ సాధారణ ప్రసవం ద్వారా ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చారు. ప్రసవానంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో.. మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కత్తితో కోసుకోవడం ద్వారా ఆమె పొత్తి కడుపులో తీవ్ర గాయమైనట్లు వైద్యులు తెలిపారు. ఆమె భర్త ఆరునెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడని, దీంతో ఇంట్లో ఒంటరిగా నివసిస్తోందని స్థానికులు వెల్లడించారు. మహిళను స్ట్రెచర్‌పై తరలిస్తున్న సమయంలో తీసిన ఓ వీడియోలో.. తీవ్రమైన నొప్పుల కారణంగా తానే ఈ పని చేశానని ఆమె చెబుతున్నట్లు వినిపిస్తోందని పోలీసులు తెలిపారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.