టైమ్‌కి పని అవ్వాలంటే.. ఈ టెక్నిక్స్‌ తెలిసుండాలి!

అనుకున్న పనులు సమయానికి పూర్తి కావాలంటే సమయ పాలన చాలా ముఖ్యం. దీన్ని పట్టించుకోకపోతే పనులన్నీ గందరగోళంగా, అసంపూర్తిగా ఉంటాయి. అందుకే, సమయపాలనలో ఉన్న కొన్ని టెక్నిక్స్‌ను సందర్భానుసారం పాటిస్తే.. మీకు తిరుగుండదు. మరి అవేంటో తెలుసుకుందాం.. పదండి


50-10 రూల్‌

ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు 50 నిమిషాలపాటు ఎలాంటి అవరోధాలు లేకుండా ఏకాగ్రతతో పనిచేయాలి. ఆ తర్వాత 10 నిమిషాలు విరామం తీసుకోవాలి. ఈ సమయంలో చిన్న పాటి వ్యాయామం, నడక వంటివి చేస్తే శరీరం తిరిగి పుంజుకొని మళ్లీ పనిలో నిమగ్నమవడానికి వీలవుతుంది.

2 మినిట్స్‌ రూల్‌

ఇంట్లో అయినా, పనిచేసే చోట అయినా 2 నిమిషాల్లో పూర్తయ్యే పనులను వెంటనే చేయడం ఉత్తమం. చిన్నవే కదా తర్వాత చేద్దామనుకుంటే ఆయా పనులు పెండింగ్‌లో ఉండి ఆ తర్వాత గుదిబండగా మారే అవకాశముంది.

80-20 రూల్‌

మీరు చేసే పనుల్లో అతి ముఖ్యమైనవి, ఎక్కువ ఫలితాలను ఇచ్చేవి 20 శాతం పనులు ఎంపిక చేసుకోవాలి. వాటిపైనే మీ 80శాతం ఫోకస్‌ పెట్టి పనిచేయాలి. ఇలా చేయడం ద్వారా మీ శ్రమ వృథా కాకుండా ఉంటుంది.

1-3-5 రూల్‌

ఒక రోజులో 1 పెద్ద టాస్క్‌, 3 మీడియం టాస్కులు, 5 చిన్న టాస్కులు ఎంచుకోండి. మొదట పెద్ద టాస్క్‌ పూర్తి చేయండి. ఆ తర్వాత 3 మీడియం టాస్కులు, అవి పూర్తయ్యాక 5 చిన్న టాస్కులు పూర్తి చేస్తే సమస్యే ఉండదు. ఒత్తిడి లేకుండా పనులు జరిగిపోతాయి.

5/25 రూల్‌

ప్రముఖ పెట్టుబడిదారి వారెన్‌ బఫెట్‌ 5/25 రూల్‌ను తీసుకొచ్చారు. దీని ప్రకారం.. మీరు చేయాల్సినవాటిని 25 పనులుగా విభజించుకోవాలి. వాటిని ప్రాధాన్యత క్రమంలో జాబితాలో రాసుకోవాలి. వాటిలో తొలి 5 ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయాలి.

పొమోరోడో టెక్నిక్‌

ఒక పనిని 25 నిమిషాలపాటు ఏకాగ్రతతో చేయాలి. ఆ తర్వాత 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా 4 సార్లు పునరావృతం చేయాలి. అంటే 2 గంటలపాటు ఈ విధంగా పనిచేసి ఆ తర్వాత 15-30 నిమిషాలు విరామం తీసుకోవాలి.

ఈట్‌ యువర్‌ ఫ్రాగ్‌

మీరు చేయాల్సిన పనుల్లో అతి ముఖ్యమైన/ కఠినమైన పనిని మొదట చేయాలి. దాన్ని విజయవంతంగా పూర్తి చేసినప్పుడు వచ్చే ఆత్మవిశ్వాసం రోజంతా కొనసాగుతుంది. ఇతర పనులన్నీ సులభంగా చేసేయగలుగుతారు.

60 సెకండ్స్‌ స్టార్ట్‌

ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఇది చేయగలమా? ఎలా చేయాలి? అంటూ ఆలోచిస్తూ ఉంటే సమయం వృథా అవుతుంది. అందుకే, ఓ పని చేయాల్సి వస్తే దాన్ని వెంటనే ప్రారంభించి 60 సెకండ్ల పాటు కొనసాగించి ఆపండి. అప్పుడు చేయాల్సిన పనిపై శ్రద్ధ వస్తుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.