బెంజ్ సర్కిల్ దాటాలంటే గంటల తరబడి నిరీక్షణ.. వారధి జంక్షన్ వద్ద నిత్యం వాహనాల రద్దీ.. అయితే ఇక ఇవేవీ ఉండవు.. విజయవాడ నగర ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. నగరం మధ్యలో దాదాపు 14 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
విజయవాడ నగరవాసుల త్వరలో ట్రాఫిక్ కష్టాల నుండి శాశ్వత విముక్తి లభించనుంది. హైదరాబాద్-మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నగరం మధ్యలో దాదాపు 14 కిలోమీటర్ల పొడవైన భారీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించే ప్రతిపాదనను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిశీలిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు, అటు మచిలీపట్నం నుంచి విజయవాడ శివారు వరకు రహదారిని ఆరు వరుసలుగా విస్తరిస్తున్నారు. అయితే అత్యంత రద్దీగా ఉండే విజయవాడ నగర పరిధిలోని కనకదుర్గ ఫ్లైఓవర్ నుండి దావులూరు వరకు మాత్రం కేవలం నాలుగు వరుసల రోడ్డు మాత్రమే ఉంది. ఒకవేళ నగరం మధ్యలో రోడ్డును ఆరు వరుసలుగా మార్చకపోతే, నగరానికి ఇరువైపులా స్పీడుగా వచ్చే వాహనాలు నగరం లోపలికి రాగానే ట్రాఫిక్ జామ్ సమస్యను ఎదుర్కొంటాయి. దీనిని అధిగమించేందుకు నగరంలోని ఇళ్ల సేకరణ అవసరం లేకుండా, గాల్లోనే వంతెన నిర్మించడమే ఏకైక మార్గమని అధికారులు భావిస్తున్నారు.
ఎక్కడి నుండి ఎక్కడి వరకు?
పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని రాజీవ్ పార్క్ నుండి ప్రారంభించి.. బందరు వైపు వెళ్లే మార్గంలోని గంగూరు కూడలి వరకు ఈ ఆరు వరుసల ఫ్లైఓవర్‌ను ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 14 కి.మీ. పొడవునా వంతెనను ఎలా నిర్మించాలనే దానిపై ప్రస్తుతం రెండు ప్రణాళికలు చర్చిస్తున్నారు. 14 కి.మీ. పొడవునా ఒకే ఎలివేటెడ్ ఫ్లైఓవర్ అయితే బెంజ్ సర్కిల్ వద్ద ఇప్పటికే రెండు ఫ్లైఓవర్లు ఉండటంతో వాటిపై నుంచి మూడో అంతస్తు తరహాలో దీనిని డిజైన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే కనకదుర్గ వారధి నుంచి బెంజ్ సర్కిల్ వరకు, బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు రెండు భాగాలుగా నిర్మించాల్సి ఉంటుంది.
ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కావడం వల్ల కేవలం ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద మాత్రమే భూమి సేకరించాల్సి ఉంటుంది. హైవే వాహనాలు నేరుగా ఫ్లైఓవర్ పైనుంచి వెళ్లిపోతాయి. లోకల్ ట్రాఫిక్ కింద రోడ్డుపై ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ విస్తరణ డీపీఆర్‌లోనే ఈ ఫ్లైఓవర్‌ను చేర్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే, విజయవాడ నగరం భౌగోళికంగా కొత్త రూపును సంతరించుకుంటుంది. కేవలం ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా నగరంలోని వారధి జంక్షన్, బెంజ్ సర్కిల్, ఆటోనగర్ గేట్, కానూరు, పోరంకి వద్ద ట్రాఫిక్ భారం గణనీయంగా తగ్గుతుంది.



































