మూసీ సుందరీకరణ పేరుతో .. ఆ నది ఒడ్డున గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే గాంధీ విగ్రహం కోసం ఇళ్లను కూల్చివేస్తున్నారు. దీన్ని ఖండిస్తూ మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ(Tushar Gandhi) స్పందించారు. నివాసాలను కూల్చి గాంధీ విగ్రహం కోసం స్థలం సేకరించడం గాంధేయ విధానం కాదు అని ఆయన అన్నారు. తన ఎక్స్ అకౌంట్లో తుషార్ రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఓ అప్పీల్ చేశారు. మూసీ పరివాహకంలో ఇండ్లను కూల్చి .. గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను చేపట్టవద్దు అని తుషార్ గాంధీ తన ట్వీట్లో తెలిపారు. ఒకవేళ గాంధీ బ్రతికి ఉంటే నా పేరుతో ఇలాంటి పనులు చేయవద్దు అని ఆయన చెప్పేవారన్నారు. గాంధీ విగ్రహ ఏర్పాటు ప్రక్రియను ఆపివేయాలని తుషార్ గాంధీ కోరారు.
మూసీ సుందరీకరణ పేరిట లక్షన్నరకు పైగా ఇండ్లను నేలమట్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. హిమాయత్ సాగర్ నుంచి మొదలయ్యే మూసీ నదికి దాదాపు 900 మీటర్ల దూరంలో ఉన్న భూములను సర్వేకు గుర్తించింది. ఏకంగా 24 వేల ఎకరాలను సేకరించేందుకు స్కెచ్ వేసింది. లక్షన్నర కోట్లతో చేపట్టే మూసీ సుందరీకరణ కోసం లక్షన్నరకు పైగా కుటుంబాలను బలిపీఠం ఎక్కించేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తున్నది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం కేవలం 3,200 ఎకరాలే సేకరిస్తామని, 10 వేల నిర్మాణాలే ప్రభావితమవుతాయని డిసెంబర్లో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నది. నిజానికి ఈ సంఖ్య ఏకంగా లక్షన్నరకు పైనే ఉంటుందని స్పష్టమవుతున్నది.




































