కాంతారావు గురించి ప్రస్తావించిన కూతురు
నిజంగానే ఆయన రాకుమారుడని వ్యాఖ్య
400 ఎకరాలు ఉండేవని వివరణ
అభిమానులే ఆయన ఆస్తులని వెల్లడి
తెలుగు తెరపై జానపద కథానాయకుడు .. తెలుగు తెర రాజకుమారుడు అంటే కాంతారావు అనే చెప్పాలి. ఎన్టీఆర్ – ఏఎన్నార్ తరువాత కాంతారావు పేరే చెప్పుకుంటారు. అలాంటి కాంతారావు గురించి, ‘ఐ డ్రీమ్’ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కూతురు సుశీల ప్రస్తావించారు.”మా నాన్న వాళ్ల ఊరికి దొర. 400 ఎకరాల ఆసామి ఆయన. మొదటి నుంచి కూడా, స్నేహితులతో కలిసి సినిమాలు ఎక్కువగా చూసేవారు” అని అన్నారు.
“నాన్నగారికి ‘ఉర్దూ’ బాగా వచ్చు. డైరీని ఉర్దూలోనే రాసుకునేవారు. తన క్రింది స్థాయిలో పనిచేసేవారిని ఆయన ఎంతో గౌరవించేవారు. ఎలాంటి పరిస్థితుల్లో ఎవరినీ నొప్పించేవారు కాదు. ఆయనకి ఎంత మాత్రం గర్వం ఉండేది కాదు. నాకు మాత్రం ఆయన కూతురిగా గర్వం ఉండేది. కాంతారావు కూతురునని నలుగురూ చెప్పుకోగానే సహజంగానే గర్వం వచ్చేది. ఆయన అందం మాలో ఎవరికి కూడా రాలేదు” అని అన్నారు.
“అప్పట్లో జానపద సినిమాలలో ముగ్గురు హీరోలు మాత్రమే కత్తిని అద్భుతంగా తిప్పేవారు. ఒకరు మా నాన్నగారు అయితే, మిగతా ఇద్దరూ ఎన్టీ రామారావుగారు .. రాజనాలగారు. అప్పట్లో సినిమాల కోసం చేయించిన కత్తులు చాలాకాలం పాటు మా ఇంట్లో ఉండేవి. ఆ కత్తులను మేము పైకి ఎత్తలేకపోయేవాళ్లం .. అంత బరువు ఉండేవి. నాన్నగారు ఆస్తులు కోల్పోయినందుకు మాకు ఎప్పుడూ బాధ కలగలేదు. అభిమానులే ఆయన ఆస్తులుగా భావించి సంతోషపడ్డాము” అని చెప్పారు.



































