టీ20 ప్రపంచ కప్‌లో సెమీస్ అవకాశాలను న్యూజిలాండ్ మెరుగుపర్చుకుంది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక 107/8 స్కోరుకే పరిమితమైంది. కమిందు మెండిస్ (31), దునిత్ వెల్లలాగె (29) మాత్రమే రాణించారు. వారితోపాటు కుశాల్ మెండిస్ (11), పవన్ రత్నాయకె (10) మినహా.. మరెవరూ రెండంకెల స్కోరు చేయలేదు. రచిన్ రవీంద్ర (4/27) దెబ్బకు శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. టీ20 ప్రపంచ కప్‌లో సెంచరీ హీరో నిశాంక (0) డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. చరిత్ అసలంక (5), డాసున్ శనక (3), దుషాన్ హేమంత (3) విఫలమయ్యారు. రచిన్తోపాటు మ్యాట్ హెన్రీ 2.. సాంట్నర్, ఫిలిప్స్ చెరో వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రచిన్ రవీంద్ర నిలిచాడు.
సాంట్నర్-కోలే కీలక భాగస్వామ్యం
తొలి 12 ఓవర్ల ఆట చూశాక.. న్యూజిలాండ్ స్కోరు 160+ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే 84 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయిన ఆ జట్టును కెప్టెన్ సాంట్నర్ (47), కోలె మెక్కాంచి (31*) ఆదుకొన్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. రచిన్ రవీంద్ర (32), ఫిన్ అలెన్ (23), గ్లెన్ ఫిలిప్స్ (18) ఫర్వాలేదనిపించారు. టిమ్ సీఫెర్ట్ (8), డారిల్ మిచెల్ (3), మార్క్ చాప్మన్ (0) నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో చమీర 3, తీక్షణ 3, వెల్లలాగె ఒక వికెట్ తీశారు.
శ్రీలంక నిష్క్రమణ..
వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓటమితో శ్రీలంక టీ20 ప్రపంచ కప్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్ (3 పాయింట్లు), పాకిస్థాన్ (1 పాయింట్) మధ్యే గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్తు కోసం పోటీ ఉంది. పాకిస్థాన్ తన చివరి మ్యాచ్‌ను శ్రీలంకతో ఫిబ్రవరి 28న, ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ ఫిబ్రవరి 27న తలపడనున్నాయి. ఒకవేళ ఇంగ్లాండ్‌పై కివీస్ గెలిస్తే.. పాక్ ఇంటిముఖం పట్టినట్టే. అలా కాకుండా కివీస్ ఓడితే మాత్రం పాక్‌కు కాస్త అవకాశాలు ఉంటాయి. అప్పుడు శ్రీలంకపై మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంటుంది.


































