ఖమేనీ.. మత బోధకుడి నుంచి ప్రబల శక్తిగా! ఇరాన్‌ సుప్రీం నేత ప్రస్థానం ఇదీ…

ఆయతుల్లా అలీ ఖమేనీ.. ఇరాన్‌ సుప్రీం నేతగా 1989లో పగ్గాలు చేపట్టి మూడున్నర దశాబ్దాల పాలనలో తిరుగులేని నేతగా ఎదిగారు. పశ్చిమాసియాలో ఇరాన్‌ను ఓ ప్రాంతీయ శక్తిగా నిలిపారు. అదే సమయంలో దేశాన్ని ఉక్కు పిడికిలితో పాలించారు. తన పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ఉద్యమాలను క్రూరంగా అణచివేశారు. హెజ్‌బొల్లా, హమాస్‌ లాంటి సంస్థలకు అండగా నిలిచి ప్రాంతీయ అస్థిరతకు దారి తీశారన్న ఆరోపణలూ ఎదుర్కొన్నారు. అలాంటి నేత.. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ప్రాణాలు కోల్పోవడంతో ఇరాన్‌ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసిందనే చెప్పాలి.


ఇస్లామిక్‌ ఉద్యమం నుంచి..
ఖమేనీ.. 1939లో ఇరాన్‌లోని మషాద్‌లో జన్మించారు. చిన్న వయసులోనే షియా మత బోధకుడిగా మారారు. ఇరాన్‌ రాజు మహమ్మద్‌ రెజా పహ్లవీకి వ్యతిరేకంగా జరిగిన 1979 ఇస్లామిక్‌ విప్లవంలో పాల్గొన్నారు. ఆ సమయంలో చాలా సార్లు ఖమేనీని పోలీసులు అరెస్టు చేశారు. జైలులో నిర్బంధించారు. విప్లవం విజయవంతమై రూహుల్లా ఖమేనీ ఇరాన్‌ సుప్రీం నేతగా పగ్గాలు స్వీకరించిన అనంతరం ఖమేనీ రాజకీయ ప్రస్థానం వేగం పుంజుకుంది. 1980లో టెహ్రాన్‌లో శుక్రవారం ప్రార్థనలకు మత ప్రబోధకుడిగా ఆయన నియమితులయ్యారు. మతపరమైన పాండిత్యం అంతగా లేకపోయినా మంచి వక్తగా పేరొందారు. 1981లో ఖమేనీపై హత్యాయత్నం జరిగింది. టేప్‌ రికార్డర్‌లో బాంబు పెట్టి చంపాలని ఇస్లాం విప్లవ వ్యతిరేక గ్రూపులు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఖమేనీ కుడి చేయి శాశ్వతంగా పనిచేయకుండా పోయింది. ‘‘నాకు మెదడు, నాలుక సక్రమంగా పనిచేస్తే చాలు.. చేతితో పనిలేదు’’ అని ఒకసారి ఆ దాడి గురించి మాట్లాడుతూ ఖమేనీ అన్నారు. ఈ దాడి జరిగిన కొన్ని నెలలకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇందుకు పరిస్థితులు కూడా కలిసొచ్చాయనే చెప్పాలి. 1981లో అప్పటి అధ్యక్షుడు మహమ్మద్‌ అలీ రెజాయ్‌ బ్రీఫ్‌కేస్‌ బాంబు దాడిలో చనిపోయారు. దీంతో ఖమేనీ అధ్యక్ష బరిలోకి దిగారు. సుప్రీం నేత రూహుల్లా ఖొమైనీ అండ కూడా ఉండటంతో ఆయన విజయం నల్లేరుపై నడకైంది. అధ్యక్షుడిగా ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధంలోనూ ఖమేనీ కీలక పాత్ర పోషించారు. యుద్ధ క్షేత్రంలో పర్యటిస్తూ సైన్యంలోని కీలక అధికారులతో సంబంధాలను పెంచుకున్నారు. తదనంతర కాలంలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ)ను బలోపేతం చేయడానికి ఈ అనుభవం ఆయనకు ఉపకరించింది.

అధ్యక్షుడిగా ఎన్నికైన వేళ..
1989.. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ చరిత్రలో కీలక ఘట్టం. ఇస్లామిక్‌ విప్లవాన్ని విజయవంతంగా నడిపిన సుప్రీంనేత ఖొమైనీ మృతి చెందారు. ఆ సమయంలో వారసుడిగా ఖమేనీని మతపెద్దల కమిటీ ఎంపిక చేసింది. బాధ్యతలు చేపట్టగానే ఇరాన్‌ను అభివృద్ధి పథంలో నడుపుతానని ఇరాన్‌ ప్రజలకు ఖమేనీ హామీ ఇచ్చారు. అయితే ఎన్నడూ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. రాజ్యాంగ సవరణలు చేసి అధికారాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకున్నారు. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ)ను బలోపేతం చేశారు. దీన్ని తన వ్యక్తిగత అస్త్రంగా మలచుకున్నారు. తనకు ఎదురైన ప్రతి అసమ్మతిని ఐఆర్‌జీసీ సాయంతో అణచివేశారు. అంతటితో ఆగలేదు. లెబనాన్, గాజా, ఇరాక్, యెమెన్, సిరియాలకు ఐఆర్‌జీసీ నెట్‌వర్క్‌ను విస్తరించారు. ఆ సంస్థ ద్వారా అక్కడి షియా మిలిటెంట్లకు ఆయుధాలు, డబ్బును చేరవేశారు. లెబనాన్‌లో హెజ్‌బొల్లా.. ఇరాక్‌లో ఖతాయబ్‌ హెజ్‌బొల్లా, గాజాలో హమాస్, యెమెన్‌లో హూతీలు పురుడు పోసుకోవడానికి కారణమయ్యారు.

అంతా తానై…
అధ్యక్షుడు ఎవరు ఉన్నా.. అధికారం మాత్రం ఖమేనీయే చెలాయించారు. 1997లో ఇరాన్‌ అధ్యక్షుడిగా మహమ్మద్‌ ఖతామీ ఎన్నికయ్యారు. ఆయన సంస్కరణ వాది. ఖమేనీ వ్యతిరేకించినా, పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో మరిన్ని సంస్కరణలను కోరుతూ ఇరాన్‌ ప్రజలు ఉద్యమాలు మొదలుపెట్టారు. దీంతో ప్రజలపై ఐఆర్‌జీసీ దళాలను ఉపయోగించి ఆ నిరసనలపై ఖమేనీ ఉక్కుపాదం మోపారు. 2009లో మహమ్మద్‌ అహ్మద్‌నెజాద్‌ తిరిగి ఎన్నికవ్వడంపై వివాదం రేగింది. దీంతో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వాటిని కూడా ఐఆర్‌జీసీ సాయంతో ఖమేనీ అణచివేశారు. అయితే రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ ఇరాన్‌ ఆర్థికంగా నష్టపోతూ వచ్చింది. సహజ వనరులు పుష్కలంగా ఉన్నా.. అమెరికా ఆంక్షల కారణంగా పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ప్రజలకు ఆర్థికంగా అవకాశాలు కల్పించకపోతే మరో విప్లవం వస్తుందని ఖమేనీ అంచనా వేశారు. అందుకే 2015లో అమెరికాతో అణుచర్చలకు పచ్చజెండా ఊపారు. ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో మళ్లీ ఇరాన్‌ ప్రధాన స్రవంతిలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ 2018లో అధికారంలోకి వచ్చిన ట్రంప్‌.. అణు ఒప్పందాన్ని రద్దు చేయడంతో ఇరాన్‌ మళ్లీ ఆంక్షల చట్రంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఆర్థికంగానూ, రాజకీయంగా ఆ దేశం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది.

పతనం ప్రారంభమైందిలా..

2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ నిర్వహించిన దాడులే ఖమేనీ పతనానికి దారి తీశాయని చెప్పాలి. ఆ దాడుల తర్వాతే పశ్చిమాసియాలో సమీకరణాలు ఇరాన్‌కు వ్యతిరేకంగా మారడం ప్రారంభించాయి. ఇజ్రాయెల్‌ కేవలం గాజాలోని హమాస్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోకుండా ఇరాన్‌ నిర్మించిన మొత్తం నెట్‌వర్క్‌పై విరుచుకుపడింది. లెబనాన్‌లో హెజ్‌బొల్లాలపై యెమెన్‌లో హూతీలపై తీవ్రస్థాయిలో దాడులు చేసింది. హెజ్‌బొల్లా నేత నస్రల్లాను హత్యచేసి.. ఆ సంస్థను దాదాపు నిర్వీర్యం చేసింది. ఇది ఖమేనీని ఉలికిపాటుకు గురిచేసింది. దీనికి తోడు ఇరాన్‌కు మద్దతిచ్చే సిరియాలోని అసద్‌ ప్రభుత్వం 2025 డిసెంబరులో కుప్పకూలడం మరో భారీ దెబ్బ. ఇవన్నీ ఇరాన్‌ను బలహీన పరిచాయి. దీనికి తోడు గతేడాది జూన్‌లో 12 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్‌ దూకుడు..దానికి అమెరికా తోడవ్వడంతో ఇరాన్‌ బలహీనతలు బయటపడ్డాయి. వాటిని ఆసరాగా చేసుకొని ఇప్పుడు మళ్లీ ఆ రెండు దేశాలు సంయుక్త దాడులు ప్రారంభించి తొలి రోజునే ఖమేనీని హత్య చేశాయి. ఇది రానున్న రోజుల్లో ఇరాన్‌పై, పశ్చిమాసియాపై ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.