మధ్యప్రాచ్యంలో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్కు కీలకమైన దౌత్య, ఇంధన రంగానికి సంబంధించి శుభవార్త అందింది. భారత్, కెనడా మధ్య సుమారు 2.6 బిలియన్ డాలర్ల (రూ.23,000 కోట్లు) విలువైన దీర్ఘకాలిక యురేనియం సరఫరా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా భారత శాంతియుత అణుశక్తి కార్యక్రమానికి స్థిరమైన ఇంధన భద్రత లభించనుంది. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ఒప్పందం ప్రకటించారు. 2026 చివరి నాటికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)ను పూర్తి చేయాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక యురేనియం సరఫరాలపై కీలక ఒప్పందానికి చేరుకున్నాం. చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, కొత్త అణు సాంకేతికతలపై కలిసి పనిచేస్తాం అని తెలిపారు. ఈ ఒప్పందాన్ని కార్నీ రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో పెద్ద ముందడుగుగా అభివర్ణించారు. ఈ సమావేశంలో ముఖ్యమైన ఖనిజాలు, పునరుత్పాదక శక్తి, సాంస్కృతిక మార్పిడి రంగాల్లో అనేక అవగాహన ఒప్పందాలపై కూడా సంతకాలు జరిగాయి. విదేశాంగ మంత్రి జయశంకర్, కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ సమక్షంలో పత్రాలు మార్పిడి చేశారు.
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు పెంచాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. పునరుత్పాదక ఇంధనం, AI, క్వాంటం టెక్నాలజీ, సెమీకండక్టర్లు, సూపర్కంప్యూటింగ్ వంటి రంగాల్లో సహకారాన్ని పెంచాలని మోదీ నొక్కిచెప్పారు. విద్యా రంగంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. AI, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి రంగాల్లో కొత్త విశ్వవిద్యాలయ భాగస్వామ్యాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కెనడియన్ విశ్వవిద్యాలయాలు భారత్లో క్యాంపస్లు ప్రారంభించేందుకు కూడా అంగీకారం కుదిరింది.


































