పీతకష్టాలు పీతవన్నట్లు… యుద్ధంతో చమురు లభ్యత తగ్గి ప్రపంచమంతా ఇబ్బంది పడుతుంటే… చమురును దాచుకోలేక ఇరాన్ ఇక్కట్లు పడుతోంది! అమెరికా దిగ్బంధనం కారణంగా… ఉత్పత్తి చేస్తున్న చమురును అమ్ముకోలేక, దాచుకోలేక సతమతమవుతోంది.
హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో ఇరాన్ పరిస్థితి క్లిష్టంగా మారింది. అమెరికా కొనసాగిస్తున్న దిగ్బంధనం వల్ల చమురును విదేశాలకు ఎగుమతి చేయలేకపోతోంది. దీంతో బయటకు తీసిన చమురు అంతా దేశంలోని స్టోరేజీ ట్యాంకుల్లో, భారీ చమురు నౌకల్లో నిల్వ చేయాల్సిన పరిస్థితి. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో ఆ దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గతంలో రోజుకు 18.5 లక్షల బ్యారెళ్లుగా ఉన్న చమురు ఎగుమతులు, ఇప్పుడు కేవలం 5.67 లక్షల బ్యారెళ్లకు పడిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న ఆంక్షల వల్ల ఏ నౌక కూడా ఇరాన్ నుంచి బయట దేశాలకు చమురును తీసుకెళ్లలేకపోతోంది.
ప్రస్తుతం ఇరాన్ వద్ద కేవలం 12 నుంచి 22 రోజుల వరకు మాత్రమే చమురును నిల్వ చేసుకొనే సామర్థ్యం ఉంది.
నిల్వ చేయడానికి స్థలం లేకపోతే బావుల నుంచి చమురు తీయడం ఆపేయాలి. చమురు క్షేత్రాలను ఒక్కసారిగా మూసివేస్తే, భవిష్యత్తులో ఆ బావుల నుంచి చమురు తీయడం కష్టమవుతుంది. ఇది ఇరాన్ ఇంధన రంగానికి శాశ్వత నష్టం కలిగిస్తుంది.
పరిస్థితి దారుణంగా ఉండటంతో ఇరాన్ ఇప్పటికే ఉత్పత్తిని తగ్గిస్తోంది. రోజుకు 27.5 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి నుంచి మే మధ్య నాటికి 12-13 లక్షల బ్యారెళ్లకు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అంటే సగం కంటే ఎక్కువ ఉత్పత్తిని ఆపేయాల్సి వస్తోంది.
చమురు నిల్వ చేయడానికి ప్రస్తుతం భూమి మీద ఉన్న ట్యాంకులు నిండిపోవడంతో, ఇరాన్ భారీ చమురు నౌకలను సముద్రంపై నిలిపి ఉంచి వాటినే స్టోరేజీ ట్యాంకులుగా వాడుతోంది.
ఇరాన్ చమురు నిల్వలు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరాయి. సుమారు 185 నుంచి 195 మిలియన్ బ్యారెళ్లు ఓడల్లోనే ఉన్నాయి. ఇరాన్ చరిత్రలో ఇంత భారీమొత్తంలో చమురు ఎన్నడూ సముద్రంపై నిలిచిపోలేదు.






