తన భార్య విడాకులు కోరిన వ్యవహారంపై పరోక్షంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నాయకురాలు రంజనా నాచ్చియార్ స్పందించారు. మహిళల గౌరవాన్ని కాపాడే భాష మీ పదాల్లో కనిపించకపోతే ఇక ఆ రాజకీయం ఎందుకని, మీ నిజ స్వరూపం ఏమిటని విజయ్‌ను ప్రశ్నించారు. ఆమె తన ప్రకటనలో విజయ్‌ను ఉద్దేశించి.. మహిళా దినోత్సవంలో మీకు, మీ భార్యకు మధ్య ఉన్న సమస్యను పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘అది వర్త్ కాదు’ అన్నారు. వర్త్ కానిది మీ భార్యనా, లేక మీ వైవాహిక జీవితమా అని ప్రశ్నించారు.
రాజకీయ నాయకుడు మాట్లాడే ప్రతి మాట ఒక కుటుంబంలో మాత్రమే కాక సమాజంలో ప్రతిధ్వనిస్తుందని రంజనా తెలిపారు. భార్యను ఇంట్లోకి అనుమతించకుండా ఒక్కో కుటుంబానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పడం విరుద్ధంగా లేదా అన్నారు. ఓ నటిని వెంటబెట్టుకుని బహిరంగ ప్రాంతానికి వస్తే పెళ్లయిన తర్వాత మనమూ ఇలాగే జీవిద్దామనే ఆలోచన యువతలో నాటుకోదా అని ప్రశ్నించారు. పుట్టే ప్రతి బిడ్డకు మేనమామగా సారె ఇస్తానని చెప్పడం మంచి ఉద్దేశమని, అదే సమయంలో సొంత బిడ్డకు తండ్రిగా ఉండటం కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు ఆదర్శంగా ఉండాలని సూచించారు.

































