టీమ్‌ఇండియా ప్రధాన బౌలింగ్ అస్త్రం జస్‌ప్రీత్ బుమ్రా. అతడి సామర్థ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ తాజాగా టీ20 ప్రపంచకప్ గెలవడంలో అతడు అత్యంత కీలక పాత్ర పోషించాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌నకు కూడా బుమ్రా సేవలు భారత్‌కు చాలా అవసరం. అందుకే ఆ టోర్నీ కోసం అతణ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటోంది జట్టు యాజమాన్యం. 2027 అక్టోబరు-నవంబరులో దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో బుమ్రా దృష్టి ప్రధానంగా వన్డేలపైనే నిలవనుంది. ఈ 18 నెలల్లో అతడు టీ20ల కంటే వన్డే మ్యాచ్‌లు ఎక్కువగా ఆడుతున్నాడు. పనిభారం తగ్గించాలి కాబట్టి.. బుమ్రాను తక్కువ టీ20 మ్యాచ్‌ల్లో ఆడిస్తారు.
ఈ ఏడాది ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) ముగిశాక టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్ సన్నాహకం మొదలవుతుంది. ఐపీఎల్ ఆఖరికి జాతీయ సెలక్షన్ కమిటీ, వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, టీమ్ మేనేజ్‌మెంట్ కలిసి బుమ్రా పనిభార నిర్వహణపై ఓ బ్లూప్రింట్ సిద్ధం చేస్తారని తెలుస్తోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) మ్యాచ్‌లు ఆడే విషయంలో మాత్రం బుమ్రా రాజీపడే అవకాశం లేదు. అతడి పనిభార నిర్వహణ గత రెండేళ్లలో ఉన్నట్లే ఉంటుందని తెలుస్తోంది. ఆ కాలంలో అతడు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. 2023 నవంబరు 19 (వన్డే ప్రపంచకప్ ఫైనల్) తర్వాత.. ఈ ప్రపంచకప్ కన్నా ముందు జరిగిన కివీస్‌తో సిరీస్ ముందు వరకు బుమ్రా 42 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 21 టెస్టులు, 21 టీ20ల్లో బరిలోకి దిగాడు. ఇక నుంచి మాత్రం టీ20లకు కాకుండా వన్డేలకు ప్రాధాన్యమిస్తాడు.
‘‘టీమ్‌ఇండియా ఆడే ఏ అంతర్జాతీయ టోర్నీకి అయినా బుమ్రా ఫిట్‌నెస్ చాలా కీలకం. అందుకే భారత జట్టు మేనేజ్‌మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అతడు ఆడాల్సిన ఫార్మాట్ల ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించాలి. అతడు టెస్టు క్రికెట్ తప్పక ఆడతాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం అతడు వన్డేలపై ఎక్కువ దృష్టిసారిస్తాడు’’ అని ఓ బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించాడు. భారత ఫాస్ట్‌బౌలింగ్ పూల్ మరీ పెద్దదేమీ కాదు. అందులో బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్, హర్షిత్ రాణా ప్రధాన సభ్యులని అర్థమవుతోంది.

































