దేశవ్యాప్తంగా LPG గ్యాస్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే..ఇప్పటికి LPG గ్యాస్ పూర్తిగా ఉపయోగించని ఒక గ్రామం ఉందని తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇక్కడ, ప్రతి ఇంటిలోనూ LPG గ్యాస్ లేకుండానే వంట చేస్తారు. అది మరెక్కడో కాదు.. మన తెలంగాణలోని కొండారెడ్డిపల్లి గ్రామం. ఇప్పుడు ఈ గ్రామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దక్షిణ భారతదేశంలోనే పూర్తిగా సౌరశక్తితో నడిచే మొట్ట మొదటి గ్రామంగా గుర్తింపు పొందింది. అంతే కాదు, భారతదేశంలో ఈ ఘనత సాధించిన రెండవ గ్రామం ఇది. ఇప్పుడు, ఆ గ్రామం మరో పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. LPG గ్యాస్ సిలిండర్ల వాడకాన్ని తగ్గించడం, ఇండక్షన్ స్టవ్‌లపై వంట చేయడానికి చొరవ తీసుకోవడం.
ఇండక్షన్ స్టవ్స్ ఎందుకు ఇస్తున్నారు?:
ఇండక్షన్ స్టవ్‌లు, కుక్కర్లను గ్రామస్తులకు పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఇ-కుకింగ్, క్లీన్ కుకింగ్ పథకం కింద ఈ పని జరుగుతోంది. ఇళ్లలో LPG సిలిండర్ల వాడకాన్ని తగ్గించడం, విద్యుత్తుతో నడిచే ఇండక్షన్ స్టవ్‌లపై వంట చేయడానికి ప్రజలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఇది పర్యావరణానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. క్లీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచుతుంది.

































