హర్మూజ్‌లో ఇరాన్‌ వల.. అడుగుకో గండం..!

హర్మూజ్‌ జలసంధి నౌకలకు మృత్యుమార్గంగా మారనుంది. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు పెరిగేకొద్దీ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు ఇరాన్‌ ( Iran ) నుంచి ప్రతిఘటన తీవ్రమవుతోంది. తన అధీనంలో ఉన్న హర్మూజ్‌ జలసంధిని శత్రునౌకల పాలిట మృత్యుమార్గంగా మార్చేస్తోంది. ఇందుకోసం తాజాగా తన పాత ఆయుధాన్ని రంగంలోకి దించుతోంది. ఈ ప్రాంతంలోకి అమెరికా ( USA ) మిత్ర దేశాల నౌకలు అడుగుపెడితే పేలిపోయేలా ఇరాన్‌ ఎక్కడికక్కడ ఉచ్చులు పరిచింది. ఈ చర్యలు ట్రంప్‌ సర్కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ ఆయుధం పేరు ‘సీమైన్స్‌’ లేదా ‘నేవల్‌ మైన్స్‌’ (సముద్రపు మందుపాతరలు)..! సముద్రంలో ఒక్కసారి మైన్స్‌ను పరిచాక నౌకలు ఏమార్గంలో ప్రయాణిస్తే హర్మూజ్‌ను దాటగలవో ఒక్క ఇరాన్‌ ( Iran )కు మాత్రమే తెలుసు.


ఏమిటీ నేవల్‌ మైన్స్‌..?
సాధారణంగా శత్రువులు సరిహద్దులు దాటకుండా భూమిలో మందుపాతర్లు అమర్చినట్లే సముద్ర జలాల్లో అమర్చే వాటిని సీమైన్స్‌ అంటారు. నౌకలు, జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి అవి ప్రయాణించే మార్గాల్లో ఏర్పాటుచేస్తారు. దీంతో శత్రువు ఆ మార్గంలోకి రాకుండా ఇవి భయపెడుతుంటాయి. అమెరికా ( USA ) విప్లవం సమయంలో గన్‌పౌడర్‌ నీటి అడుగున కూడా పేలుతుందనే విషయాన్ని యేల్‌కు చెందిన డేవిడ్‌బుష్‌నెల్‌ గుర్తించినప్పుడే వీటి తయారీకి బీజం పడింది. వీటిల్లో వివిధ రకాల మైన్స్‌ ఉన్నాయి. సముద్రం అడుగున గొలుసులతో అమర్చేవి, ప్రొపల్షన్‌ వ్యవస్థలతో పనిచేసేవి ముఖ్యమైనవి.

ఇక మైన్స్‌ను నౌకల కింది భాగాలు తాకినా, అయస్కాంత క్షేత్రం సమీపంలోకి వచ్చినా, నౌకల ప్రొపల్షన్‌ వ్యవస్థ చప్పుడుకు, నౌక నీటిపై సృష్టించే ఒత్తిడికి ఇవి పేలిపోయేలా వీటిని రూపొందిస్తారు. రిమోట్‌ సాయంతో వీటిని పేల్చవచ్చు. వీటిల్లో మైన్‌ స్థాయిని బట్టి 50 నుంచి 1,000 కేజీల పేలుడు పదార్థాలు ఉంటాయి. మిగిలిన ఆయుధాలతో పోలిస్తే ఇవి చౌక.

ఇరాన్‌ ( Iran ) అమ్ముల పొదిలో..
ఇరాన్‌ వద్ద దాదాపు 2,000 నుంచి 6,000 వరకు సీమైన్స్‌ ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. వీటిని చైనా, రష్యా నుంచి కొనుగోలు చేయడంతోపాటు.. సొంతంగా కూడా ఉత్పత్తి చేస్తోంది. ఇరాన్‌ నౌకాదళంలోని చిన్న నౌకలు ఒక్కోటి రెండు నుంచి మూడు మైన్స్‌ను సముద్రంలో అమర్చగలవు. ఇలాంటి నౌకలు వందల సంఖ్యలో ఇరాన్‌ వద్ద ఉన్నాయి. ఇక సబ్‌మెరైన్ల సాయంతో సముద్రంలో అమర్చే మైన్స్‌ కూడా టెహ్రాన్‌ వద్ద ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీటి సాయంతో సముద్రంలో మైన్స్‌ను పెట్టడం వల్ల హర్మూజ్‌ జలసంధిని దాటడం రవాణా నౌకలకు అసాధ్యంగా మారిపోతుంది. 1980ల్లో ట్యాంకర్‌ వార్‌ వేళ భారీ సంఖ్యలో సీమైన్లను వాడి నౌకలను ధ్వంసం చేశారు.

ఈ క్రమంలో ట్రంప్‌ సర్కారు కూడా కంగారుపడుతోంది. హర్మూజ్‌లో సీమైన్స్‌ను తొలగించాలని ట్రంప్‌ స్వయంగా ఆదేశాలు జారీ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే నేడు అమెరికా దళాలు 16 ఇరానియన్‌ మైన్‌ లేయర్స్‌ నౌకలను ధ్వంసం చేశాయి. కాకపోతే ఇంకా పెద్దసంఖ్యలో ఇరాన్‌ వద్ద ఈ శ్రేణి నౌకలు ఉన్నాయి.

ట్రంప్‌ సర్కారు నిర్ణయంతో మరిన్ని తిప్పలు..
ఓవైపు ఇరాన్‌ ( Iran ) హర్మూజ్‌లో సీమైన్స్‌ను అమరుస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న వేళ.. ట్రంప్‌ సర్కారు గతంలో తీసుకొన్న ఓ నిర్ణయం బెడిసికొట్టినట్లైంది. సీమైన్స్‌ను తొలగించే మైన్‌స్వీపర్స్‌కు తీవ్రమైన కొరత ఏర్పడింది. గతేడాది సెప్టెంబర్‌లో పర్షియన్‌ గల్ఫ్‌లోని నాలుగు స్పెషలైజ్డ్‌ మైన్‌ స్వీపర్లను డీకమిషన్‌ చేసింది. బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ కేంద్రం నుంచి వీటిని ఓ హెవీ లిఫ్ట్‌వెసల్‌లో ఉంచి తుక్కు కింద అమెరికాకు తరలించేసింది. ఈ ప్రాంతానికి తరలించనున్న నాలుగు లిట్టోరల్‌ కాంబాట్‌ షిప్‌లకు మైన్స్‌ను తొలగించే బాధ్యతలు అప్పగిస్తామని అప్పట్లో యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. అయితే వీటి పనితీరు ఏమాత్రం బాగోలేదని రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇక నాలుగు పంపుతానన్న అమెరికా మూడింటినే పంపింది. వీటిని హర్మూజ్‌ జలసంధిలో మోహరిస్తే అది కేవలం పబ్లిసిటీ స్టంట్‌గానే మిగులుతుందని అమెరికా నేవీ మాజీ కెప్టెన్‌, విశ్లేషకుడు కార్ల్‌ షూస్టర్‌ సీఎన్‌ఎన్‌కు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఓడలకు హర్మూజ్‌ జలసంధి మృత్యు మార్గంగా మారే ప్రమాదం పొంచి ఉంది.