టీమ్‌ఇండియా (Team India) ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఓ వివాదంలో చిక్కుకున్నాడు. పుణెకు చెందిన లాయర్ వాజిద్ ఖాన్ శివాజీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో హార్దిక్ పాండ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీ20 వరల్డ్ కప్ (ICC Mens T20 World Cup) 2026ను టీమ్‌ఇండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన సంబరాల్లో హార్దిక్ పాండ్య జాతీయజెండాను ఒంటికి చుట్టుకొని కనిపించాడు. ఇదే ప్రస్తుత వివాదానికి కారణమైంది.
‘మీరు వరల్డ్ కప్ వేడుకల్లో చూసే ఉంటారు. హార్దిక్ పాండ్య తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి మైదానంలో గెంతులు వేశాడు. ఆ సమయంలో అతడు జాతీయ జెండాను తన ఒంటికి కట్టుకొన్నాడు. 1971 నేషనల్ ఫ్లాగ్ యాక్ట్ సెక్షన్ 2 ప్రకారం మనం జాతీయజెండాకు గౌరవం ఇవ్వాలి. హార్దిక్ పాండ్య ఈ వేడుకలో జాతీయ జెండాను ధరించి, తన స్నేహితురాలితో కలిసి వేదికపై కూర్చొన్నాడు. ఇది జాతీయజెండాను అవమానించడమే అని నేను నమ్ముతున్నాను’ అని వాజిద్ ఖాన్ అన్నాడు.
‘అందుకే నేను శివాజీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశాను. అప్పుడు వారు (పోలీసులు) ఆ సంఘటన ఇక్కడ జరగలేదు కదా అని అన్నారు. జాతీయ జెండా అనేది యావత్ దేశానికి చిహ్నం. కాబట్టి ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చని వారికి వివరించా. చివరికి వారు నా ఫిర్యాదు స్వీకరించారు. వారు నాకు దానికి సంబంధించిన కాపీ కూడా ఇచ్చారు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నేనైతే ఫిర్యాదు చేశా’ అని అతడు పేర్కొన్నాడు.

































