ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

BSNL ‘Kavach Number’: డిజిటల్ ఇండియా యుగంలో మహిళల భద్రత, ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త సేవను ప్రారంభించింది. “కవచ్ నంబర్” పేరుతో వచ్చిన ఈ సేవ మహిళల వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను రహస్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ సేవ ద్వారా మహిళలకు ఒక 10 అంకెల ప్రత్యామ్నాయ (టెంపరరీ) నంబర్ అందుతుంది.


సాధారణంగా ఫిజికల్ స్టోర్లలో రీచార్జ్ చేసేటప్పుడు వ్యక్తిగత మొబైల్ నంబర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు “కవచ్ నంబర్” ద్వారా అసలు నంబర్ వెల్లడించకుండా రీచార్జ్ చేయించుకోవచ్చు. అసలు ఈ BSNL కవచ్ నంబర్ అంటే ఏంటంటే.. ఈ సేవను యాక్టివేట్ చేసిన తర్వాత మహిళలకు వారి ప్రాథమిక మొబైల్ నంబర్‌ కు అనుసంధానమైన మరో 10 అంకెల టెంపరరీ నంబర్ ఇవ్వబడుతుంది. దీనితో మీకు తెలియని స్టోర్‌లో రీచార్జ్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా మీ మొబైల్ నంబర్ ఇవ్వడానికి ఇష్టంలేని పరిస్థితుల్లో.. అసలు నంబర్‌ కు బదులుగా ఈ కవచ్ నంబర్‌ ను ఇవ్వవచ్చు.

ఆ స్టోర్ ఆ టెంపరరీ నంబర్‌ తో రీచార్జ్ చేస్తే, టాక్‌టైమ్ లేదా డేటా నేరుగా మీ అసలు మొబైల్ నంబర్‌ కే చేరుతుంది. అయితే భద్రత కారణాల వల్ల ఈ టెంపరరీ నంబర్‌కు కాల్స్ రావు, మెసేజ్‌లు కూడా పంపలేరు. ఇది కేవలం రీచార్జ్, లావాదేవీల కోసం మాత్రమే ఉపయోగించే డమ్మీ నంబర్. ప్రస్తుతం ఈ సేవ బిఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ లేదా సెల్ఫ్ కేర్ యాప్‌లో అందుబాటులో లేదు. దీన్ని యాక్టివేట్ చేయడానికి సులభమైన మాన్యువల్ ప్రక్రియ ఉంది.

* ముందుగా మీ BSNL నంబర్ నుంచి 1800-180-1503 అనే టోల్ ఫ్రీ నంబర్‌ కు కాల్ చేయాలి.
* కాల్ కనెక్ట్ అయిన తరువాత IVR సూచనలను అనుసరించాలి.
* కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌ తో మాట్లాడే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* మీ సర్వీస్ ఏరియా, పిన్ కోడ్ వంటి ప్రాథమిక వివరాలను అడిగి ధృవీకరిస్తారు.
* వివరాలు ధృవీకరించిన తరువాత మీకు 10 అంకెల కవచ్ నంబర్ SMS ద్వారా పంపిస్తారు.
* ఆ తరువాత మీరు మీ అసలు మొబైల్ నంబర్ గోప్యంగా ఉంచాలనుకున్న ప్రతిచోటా ఈ కవచ్ నంబర్‌ ను ఉపయోగించవచ్చు.