‘సన్‌రైజర్స్‌’ జట్టులో పాక్‌ క్రికెటర్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్!

ఇంగ్లాండ్‌ వేదికగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ లీగ్ ‘ది హండ్రెడ్‌’. ప్రస్తుత సీజన్‌ కోసం వేలం కార్యక్రమం జరుగుతోంది. ఇందులోని మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, ఎంఐ లండన్, సౌథరన్ బ్రేవ్, సన్‌రైజర్స్ లీడ్స్‌ జట్లలో ఐపీఎల్ ఫ్రాంచైజీదారులకు వాటాలున్నాయి. దీంతో పాకిస్థాన్‌ క్రికెటర్లకు వేలంలో అవకాశం రాదని భారత అభిమానులు భావించారు. కానీ, లీగ్‌ నిర్వాహకులు వారికి ఛాన్స్‌ ఇవ్వడంతో వేలంలో పాల్గొన్నారు.


అయితే, పాక్‌కు చెందిన స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ జట్టు దక్కించుకుంది. అతడి కోసం రూ.2.34 కోట్లు వెచ్చించింది. సన్ గ్రూప్‌నకు ఇందులో వాటా ఉండటం గమనార్హం. దీంతో సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్థాన్‌ ఆటగాళ్లను ఎలా తీసుకుంటారని ఫ్యాన్స్ ప్రశ్నించారు. వేలంలో సన్‌రైజర్స్ సీఈవో కావ్యా మారన్, ప్రధాన కోచ్ డానియల్ వెట్టోరి కూడా పాల్గొన్నారు. సన్‌రైజర్స్ లీడ్స్‌ జట్టుకు హ్యారీ బ్రూక్ సారథిగా ఉన్నాడు. దీంతో పాకిస్థాన్‌ ప్లేయర్‌తో భారత్‌కు చెందిన ఫ్రాంచైజీ యాజమాన్యం ఒప్పందం చేసుకోవడం ఇదే మొదటిసారి.

వీరు అన్‌సోల్డ్..
పాకిస్థాన్‌కు చెందిన 14 మంది తొలుత ఈ వేలంలో పేరు నమోదు చేసుకున్నారు. అయితే, షహీన్ షా అఫ్రిది వేలం నుంచి వైదొలిగాడు. వైవిధ్య స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌ను బర్మింగ్‌హామ్‌ ఫోనిక్స్ దక్కించుకుంది. ఇప్పటివరకు హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, సైమ్ ఆయుబ్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. వీరంతా అన్‌సోల్డ్‌గా ఉన్నారు.