Orbiter V1: రూ.49,999కే టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఆహా అనిపించే ఫీచర్లు!

ప్రముఖ ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తన విద్యుత్‌ ద్విచక్ర వాహన శ్రేణిని మరింత విస్తరించింది. గతేడాది ఆర్బిటర్‌ పేరిట స్కూటర్‌ను లాంచ్‌ చేసిన టీవీఎస్‌.. తాజాగా ఆర్బిటర్‌ వీ1 (TVS Orbiter V1)ను లాంచ్‌ చేసింది. వీ1 మోడల్‌ 1.8kWh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుండగా.. వీ2 3.1kWh బ్యాటరీ సామర్థ్యంతో లభ్యమవుతుంది.


వినియోగదారులకు అందుబాటు ధరలో స్కూటర్‌ను అందించడంలో భాగంగా బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ (BaaS) మోడల్‌ను టీవీఎస్‌ తీసుకొచ్చింది. దీనివల్ల రూ.49,999కే (ఎక్స్‌షోరూమ్‌ దిల్లీ) స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ ధరలు నెలకు రూ.862 నుంచి ప్రారంభమవుతాయి. ఒకవేళ బ్యాటరీ సహా కొనుగోలు చేయాలంటే రూ.84,500 చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బిటర్‌ వీ2 మోడల్‌ ధర రూ.99,900గా నిర్ణయించారు.

టీవీఎస్‌ ఆర్బిటర్‌ వీ1 ఐడీసీ రేంజ్‌ 86 కిలోమీటర్లు కాగా.. ఆర్బిటర్‌ వీ2 158 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. రెండింట్లోనూ 34 లీటర్ల అండర్‌ సీట్‌ స్టోరేజీ ఉంది. 5.5 అంగుళాల ఎల్‌సీడీ క్లస్టర్‌ ఉంది. టీవీఎస్‌ స్మార్ట్‌కనెక్ట్‌ యాప్‌ ద్వారా బ్లూటూత్‌ కనెక్టివిటీ, కాల్‌/ఎస్సెమ్మెస్‌ అలర్ట్‌లు, టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌ వంటి సదుపాయాలు పొందొచ్చు. విద్యుత్‌ వాహనాల్లో బ్యాటరీనే కీలకం. వాహన ధరలో కూడా బ్యాటరీదే సింహభాగం. దీంతో ఈవీని సొంతం చేసుకోవడానికి కొందరు వెనకడుగు వేస్తున్నారు. బ్యాటరీ రెంటల్‌ విధానం వల్ల వాహనాన్ని సొంతం చేసుకునే ఖర్చును కంపెనీలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. తొలుత కార్ల కంపెనీలు ఈ విధానాన్ని తీసుకురాగా.. టూవీలర్‌ కంపెనీలూ అదే బాటలో పయనిస్తున్నాయి.