ప్రభుత్వ అధికారికే టోకరా.. డిజిటల్‌ అరెస్టు పేరుతో రూ.59లక్షలు వసూలు

సులభంగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ముగ్గురు యువకులు ఒక పంచాయతీ అధికారిని డిజిటల్ ఆరెస్ట్ పేరుతో భయపెట్టి.. రూ.59 లక్షలు దోచుకున్నారు. ఈ సైబర్ నేరానికి పాల్పడిన ఆ యువకులను చోడవరం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామంలో పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ అధికారి తమ్మరబ కొండలరావు నివాసం ఉంటున్నారు.


విశాఖకు చెందిన సదాశివాని వెంకట శివ రామకాంత్, లంపిముఖి మణికంఠేశ్వరరావు, ఇల్లపు హేమ సంతోష్.. కొండలరావుకు ఫోన్‌ చేసి డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో భయపెట్టారు. మహిళలు, మహిళా సిబ్బంది పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ వేధింపులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, సుప్రీంకోర్టు అరెస్టు వారెంట్‌కు ఆదేశాలు ఇచ్చిందని, అందుకే డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నామని బెదిరించారు. దీంతో భయపడ్డ కొండలరావు.. సైబర్‌ నేరగాళ్ల బ్యాంక్‌ ఖాతాలకు దశలవారీగా రూ.59లక్షలు జమ చేశారు. మోసపోయినట్లు గ్రహించిన కొండలరావు సహోద్యోగుల సాయంతో చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.