చల్లటి కబురు చెప్పిన ఐఎండీ

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి.. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణంగా మే రెండో వారం తర్వాత తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.


కానీ ఈసారి ఏప్రిల్‌ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డవుతున్నాయి. వడగాడ్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నాయి.

ఈ నెల 14 లేదా 15న అండమాన్‌ తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఈసారి ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణాది, పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్‌లో మే 7 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, 30-40 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో మే 4 నుండి మే 7 మధ్య వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

రేపు, ఎల్లుండి(మే 3,4) జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ప్రాంతాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్-మణిపూర్-మిజోరం-త్రిపుర ప్రాంతాల్లో మే 3 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో మే 4 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

తెలంగాణలో సాధారణంగా మే రెండో వారం తర్వాత తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారి ఏప్రిల్‌ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డవుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ వరకు అధిక ఉష్ణోగ్రతలు వరుసగా నమోదు కావడాన్ని హీట్‌వేవ్‌ (వడగాడ్పులు)గా పరిగణిస్తారు.

ఈ లెక్కన రాష్ట్రంలో ఏప్రిల్‌ 14 నుంచి వరుసగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్‌లోనే ఏకంగా 14 రోజులపాటు హీట్‌వేవ్‌ ప్రభావం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక మేలో తొలిరోజునే 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మేర సగటు ఉష్ణోగ్రతలు నమోదవగా ఈ నెలలో ఇంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వడగాడ్పుల రోజులు సైతం అత్యధికంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.