పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ లేదా ఏదైనా పెట్టుబడి చేస్తున్న వారికి బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది.
ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పోస్టాఫీసు ట్రాన్సాక్షన్ల నియమాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా నగదు డిపాజిట్లు, విత్ డ్రాయల్స్, కొత్త ఖాతాల ప్రారంభానికి సంబంధించిన పాన్ కార్డు వినియోగంపై రూల్స్ కఠినతరం చేశారు. ఈ క్రమంలో కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనల గురించిన వివరాలు తెలుసుకుందాం.
పాన్ తప్పనిసరి
కొత్త నిబంధనల ప్రకారం పోస్టాఫీసులో జరిపే అన్ని నిర్దిష్ట ట్రాన్సాక్షన్లకు ఖాతాదారులకు తమ పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ ఖాతాదారుడికి పాన్ కార్డు లేనట్లయితే దానికి బదులుగా ఫామ్ 97 సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఖాతాదారు పేరు, అడ్రస్, ట్రాన్సాక్షన్ స్వభావం, మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలను తగిన ఆధారాలతో జత చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ లను పోస్టాఫీసు అధికారులు ఆరు ఏళ్ల పాటు భద్రపరుస్తారు.
ఫామ్ 15జీ, 15హెచ్ స్థానంలో కొత్త ఫామ్
వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పొందే వారికి కూడా మార్పులు జరిగాయి. గతంలో వినియోగంలో ఉన్న ఫామ్ 15జీ, 15హెచ్ స్థానంలో ఇప్పుడు ఒక ఫారం అందుబాటులోకి వచ్చింది. అదే ఫామ్ 121 ప్రవేశపెట్టారు. తమ అంచనా వేసిన వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి రాదని భావించే వారు ఈ ఫారమ్ 121 ద్వారా డిక్లరేషన్ ఇవ్వాలి. దీంతో పోస్టాఫీసు వారు మీ వడ్డీ ఆదాయం నుంచి ముందస్తు పన్ను కోతను విధించరు. ఈ డిక్లరేషన్ ప్రతి ఆర్థిక సంవత్సరానికి విడి విడిగా సమర్పించాల్సి ఉంటుంది.
కీలక మార్పులి ఇవే
పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం లేదా విత్ డ్రా చేయడం లేదా టైమ్ డిపాజిట్లు ఓపెన్ చేసేటప్పుడు పాన్ వివరాలు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో పాన్ లేని వారు వాడే ఫామ్ 60 స్థానంలో ఇప్పుడు ఫామ్ 97, 98లు అమలులో ఉన్నాయి. సెప్టెంబర్ 30 వరకు అందిన డిక్లరేషన్ను అక్టోబర్ 31వ తేదీలోపు అలాగే మార్చి 31 వరకు అందిన వాటిని ఏప్రిల్ 30లోపు రిపోర్ట్ చేయాలని పోస్టాఫీసులకు గడువు విధించారు. పోస్టాఫీసు ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీలలో పారదర్శకతను పెంచేందుకు, పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ఖాతాదారులు పోస్టాఫీసుకు వెళ్లేటప్పుడు తమ పాన్ కార్డును సిద్ధంగా ఉంచుకోవడం శ్రేయస్కరం. సిస్టమ్ అప్డేట్ అయ్యే వరకు పాత ఫామ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వీలైనంత త్వరగా కొత్త నిబంధనల పట్ల అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.




















