అమెరికాలో సజీవంగా 360 ఏళ్లు దాటిన వ్యక్తి..!

Elon Musk: అమెరికాలో సజీవంగా 360 ఏళ్లు దాటిన వ్యక్తి..!


అమెరికాలో సోషల్‌ సెక్యూరిటీ విభాగం రికార్డులు చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. అక్కడ ఏకంగా 100 ఏళ్లు దాటిన వారు 2 కోట్ల మంది ఉన్నట్లు చెబుతున్నాయి. దటీజ్‌ అమెరికా..!

అమెరికా(USA)లో వందల ఏళ్ల వయసున్న వ్యక్తులు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. వారిలో 200 ఏళ్ల వయసు దాటినవారు రెండు వేల మందికిపైగా ఉన్నారట..! ఇక 360-369 ఏళ్ల వయసున్న వ్యక్తి ఒకరున్నారు. ఈ విషయాన్ని అక్కడి సోషల్‌ సెక్యూరిటీ డేటా విభాగం చెబుతోంది. ఈవిషయాన్ని డోజ్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషీయెన్సీ) బృందం ధ్రువీకరించింది. తాజాగా దాని అధిపతి ఎలాన్‌ మస్క్‌ దీనిని ఎక్స్‌లో వెల్లడించారు. వందేళ్లు దాటిన దాదాపు 2 కోట్ల మంది ఇప్పటికీ సోషల్‌ సెక్యూరిటీ లబ్ధికి అర్హుల జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి సోషల్‌ సెక్యూరిటీ అర్హుల జాబితా సంఖ్య అమెరికాలో ప్రస్తుత పౌరుల సంఖ్య కంటే అధికంగా ఉందని వెల్లడించారు. చరిత్రలోనే ఇది అతిపెద్ద మోసమని పేర్కొన్నారు. వాస్తవానికి 2023లో సోషల్‌ సెక్యూరిటీ ఆడిట్‌లో దాదాపు 18.9 మిలియన్ల మంది వందేళ్లు దాటిన వారున్నట్లు గుర్తించారు. వారు ఆదాయం పొందడం లేదా.. లబ్ధిలను స్వీకరించడం కానీ, చేయడం లేదు. అయినా ఆ జాబితాను సవరించలేదు.

112 ఏళ్ల వయసున్నవారు 65 లక్షల మంది సోషల్‌ సెక్యూరిటీ నెంబర్లను కలిగిఉన్నారు. కాని, వారికి సంబంధించి ఎటువంటి డెత్‌ ఇన్ఫర్మేషన్‌ నమోదు చేయలేదు. వీరంతా ఎలక్ట్రానిక్‌ డెత్‌ ఇన్ఫర్మేషన్‌ నమోదు వ్యవస్థ రాకముందే ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి భూమ్మీద కేవలం 35 మంది మాత్రమే ఈ వయస్సును దాటినవారున్నారు. ఇక జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య కేవలం 86,000 మాత్రమే. ఇక అమెరికాలోని సోషల్‌ సెక్యూరిటీ అడ్మిన్‌స్ట్రేషన్‌ ప్రజలకు చెందిన రిటైర్మెంట్‌, వైకల్యంతో బాధపడేవారికి సంబంధించిన ఆదాయమార్గాలను సమకూరుస్తుంది.

4.7 ట్రిలియన్‌ డాలర్లు ఎక్కడికెళ్లాయి..
అమెరికాలో ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ నుంచి చెల్లించిన 4.7 ట్రిలియన్‌ డాలర్ల (రూ.4 కోట్ల కోట్లు)కు, టాస్‌ (ట్రెజరీ అకౌంట్‌ సింబల్‌) లేదని డోజ్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. దీంతో ఆ నిధులు ఎటు వెళ్లాయో గుర్తించడం దాదాపు అసాధ్యమని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ కోడ్‌ వాడటం ఇప్పటివరకు ఆప్షనల్‌ అని వెల్లడించారు. కానీ, తాజాగా డోజ్‌ ఈ విషయాన్ని గుర్తించడంతో టాస్‌ కోడ్‌ వాడటం తప్పనిసరి చేసినట్లు మస్క్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఇటీవలే ట్రంప్‌ కార్యవర్గం మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌కు ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ సమాచారం చూసేందుకు యాక్సెస్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా డోజ్‌ అమెరికా రెవెన్యూ డిపార్ట్‌మెంట్లో పన్ను చెల్లింపుదారుల డేటాలో కూడా తమకు యాక్సెస్‌ ఇవ్వాలని కోరింది. ఇది లభిస్తే మాత్రం అమెరికాలో పన్ను చెల్లింపుదారులు, బ్యాంకులు, ఇతర సున్నితమైన డేటా మొత్తం డోజ్‌ చేతికి వస్తుంది.