మన దేశంలో కార్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. మధ్య తరగతి ప్రజలు కూడా తమ అవసరాల కోసం వీటిని వినియోగిస్తున్నారు. కార్ల ధరలు అందబాటులోకి రావడం దీనికి ప్రధానం కారణం. మన దేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండడంతో వారి అవసరాలకు అనుగుణంగా ఉండే కార్లను తయారు చేయడానికి వివిధ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీనిలో భాగంగా దక్షిణ కొరియాకు చెందిన కియా కంపెనీ గతంలో కారెన్స్ మోడల్ ను విడుదల చేసింది. కుటుంబంతో కలిసి ప్రయాణం చేసేందుకు వీలుగా రూపొందించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా కారెన్స్ క్లావిస్ అనే కొత్త కారును తీసుకువచ్చింది. దాని ప్రత్యేకతలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.
కియా కంపెనీ కార్లకు మన దేశంలో మంచి ఆదరణ లభిస్తోంది. అతి తక్కువ కాలంలోనే ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్ తో కార్లను విడుదల చేస్తూ విక్రయాలను పెంచుకుంటోంది. కొత్తగా విడుదల చేసిన కారెన్స్ క్లావిస్ మోడల్ కూడా అదే కొవలోకి వస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.11,49 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ధారించారు. ఇప్పటికే బుక్కింగ్ లు కూడా ప్రారంభమయ్యాయి. టోకెన్ మొత్తంగా రూ.25 వేలు చెల్లించి బుక్కింగ్ చేసుకోవచ్చు.
కారెన్స్ క్లావిస్ కారును ఏడు రకాల వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. వాటిని హెచ్ టీఈ, హెచ్ టీఈ (ఓ), హెచ్ టీకే, హెచ్ టీకే +, హెచ్ టీకే + (ఓ), హెచ్ టీఎక్స్, హెచ్ టీఎక్స్+ అని పిలుస్తున్నారు. వీటి ధరలు రూ.11.49 లక్షల నుంచి రూ.21,50 లక్షల వరకూ ఉంటాయి. ఐవరీ సిల్వర్ గ్లోస్, ప్యూటర్ ఆలివ్, ఇంపీరియల్ బ్లూ, గ్రేసియర్ వైట్ పెర్ల్, గ్రావిటీ గ్రే, స్పార్కింగ్ సిల్వర్, అరోరా బ్లాక్ పెర్ల్, క్లియర్ వైట్ అనే వివిధ రకాల రంగుల్లో కారు ఆకట్టుకుంటోంది.
కారులో 26.62 అంగుళాల పనోరమిక్ డిస్ ప్లే ఎంతో బాగుంది. దీనికి డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్, ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ను అనుసంధానం చేశారు. ఆఫ్ సెట్ కియా లోగో కలిగిన రెండు స్పోక్ స్టీరింగ్ వీల్ ను ప్రవేశపెట్టారు. ఆరు, ఏడు సీట్ల లేఅవుట్ కారణంగా పెద్ద కుటుంబాలకూ చక్కగా సరిపోతుంది. మూడో వరుస సీట్లకు సులభంగా యాక్సెస్ పొందేందుకు వాన్ ఇన్ లివర్, ఎలక్ట్రిక్ వన్ టచ్ టంబుల్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు.
క్లావిస్ కారులో 8 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, 360 డిగ్రీల కెమెరా, విండోలను ఆపరేట్ చేసుకోవడానికి స్మార్ట్ కీ సిస్టమ్, రూఫ్ మౌంటెడ్ వెంట్లతో సీట్ మౌంటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, నాలుగు విధాలుగా సర్దుబాటు చేసుకోగల డ్రైవర్ సీటు తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 1.5 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోలు ఇంజిన్, 1.5 లీటర్ టర్బో చార్జి జీడీఐ పెట్రోలు ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. లెవల్ 2 అడాస్, ఆరు ఎయిర్ బ్యాగులు, ఈఎస్సీ, వెనుక ప్రయాణికుల హెచ్చరిక తదితర 18 రకాల భద్రతా లక్షణాలతో ఆకట్టుకుంటోంది.