నెలకు రూ.20 జీతంతో ప్రారంభించి, 30 ఏళ్ల వయసులోనే కోటి సంపాదించిన యువకుడు.

ఇరవై మూడేళ్ల వయసులో తొలిసారిగా ఉద్యోగం ప్రారంభించిన యువకుడు మొదట్లో నెలకు రూ.20 వేలే సంపాదించేవాడు. ఆ తరువాత ఏడేళ్లకు కోటి రూపాయల ఆస్తి సొంతం చేసుకున్నాడు.


ఇదెలా సాధ్యమైందీ చెబుతూ అతడు నెట్టింట పంచుకున్న పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

తానో పేద కుటుంబంలో పుట్టానని అతడు చెప్పుకొచ్చాడు. ”మా నాన్న నెలకు రూ.8 వేలు, అమ్మ రూ.7 వేలు సంపాదించేది. డబ్చులకు ఎప్పుడూ కటకటే. కానీ నేను చిన్నప్పటి నుంచీ చదువులో చురుకే. 10వ, 12వ తరగతిలో నిత్యం ఆటలపై దృష్టి పెట్టినా కూడా 89 శాతం మార్కులు సాధించా. జేఈఈ ఎగ్జామ్‌లో మంచి మార్కులు సాధించా. అయినా ఇంటికి సమీపంలోనే ఉన్న కాలేజీలో చేరా. మా ఇంటి వద్దే బస్సు ఆగుతుండటం చూసి దీన్ని ఎంచుకున్నా. కాలేజీ ఫీజులు కట్టడం కష్టంగా మారింది. లోన్లు ఎవరూ ఇచ్చేవారు కాదు. కానీ బంధువులు అండగా నిలిచారు. చివరకు చదువు పూర్తి చేశాను. బీటెక్‌లో ఉండగా మొదట ఎలక్ట్రానిక్స్‌పై మనసు మళ్లింది. మూడో సంవత్సరంలో ప్రాగ్రామింగ్‌పై ఇష్టత పెరిగింది. ఫైనలియర్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి. 400 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరవగా చివరకు 35 మంది ఎంపికయ్యారు. వారిలో నేనూ ఒకడిని”

”మొదట్లో నా జీతం నెలకు రూ.20 వేలు. చేతికి రూ.15 వచ్చేవి. పేయింగ్ గెస్ట్ అకామడేషన్‌లో ఉండేవాణ్ణి. కానీ బాగా పొదుపు చేసి నెలకు రూ.2 వేలు మిగుల్చుకునే వాణ్ణి. కోలీగ్స్, సీనియర్‌ల నుంచి చాలా నేర్చుకున్నా. వీరిలో కొందరు ప్రోగ్రామింగ్ అంటే కాపీ పేస్టు అనుకుంటూ ఉంటారు. కొవిడ్ సమయంలో ఓ భారీ కంపెనీలో జాబ్ ఆఫర్ కోల్పోయా. ఆ తరువాత మరో సంస్థ నుంచి రూ.12 లక్షల వార్షిక వేతనంతో భారీ ఆఫర్ వచ్చింది. నమ్మలేకపోయా. బ్రెయిన్‌లో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ తరువాత 2022లో మరో మార్కెట్ బూమ్. ఈసారి 13 కంపెనీల్లో ఆఫర్‌లు దక్కించుకున్నా. చివరకు ఓ సంస్థలో రూ.32 లక్షల వార్షిక శాలరీతో పనిలో చేరా”

”ఆ తరువాత నా బేసిక్ శాలరీలో మార్పు లేకపోయినప్పటికీ స్టాక్ ఆప్షన్స్ కారణంగా మొత్తం శాలరీ రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య వచ్చేది. ఇంత సంపాదిస్తున్నా ఏ రోజూ దుబారా ఖర్చులు చేయలేదు. ఇప్పటికీ ఆండ్రాయిడ్ ఫోన్‌నే వాడుతున్నా. నేను వాడే పాదరక్షలు కూడా సాధారణమైనవే. ప్రస్తుతం నేను క్రమానుగత పెట్టుబడుల్లో నెలకు రూ.71 వేలు ఇన్వెస్ట్ చేస్తున్నా. 2023లో నా మొత్తం పెట్టుబడుల విలువ రూ.31.6 లక్షలుగా ఉండేది. ఇప్పుడది రూ.100 లక్షలకు చేరుకుంది. డబ్బు పెరుగుతున్న తీరు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇలాగే కాలం గడిస్తే 40 ఏళ్లకే రిటైర్ కావొచ్చని అనుకుంటున్నా”

”ఇదంతా మీతో పంచుకుంటోంది గొప్పలు చెప్పుకోవడానికి కాదు. యువతకు నేను చెప్పేది ఒకటే. ఎక్కడ పొదుపు చేయాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలుసుకోవాలి. ఆర్థికంగా ఎంత ఎత్తుకు ఎదిగినా మర్యాదగా నడుచుకోవాలి. అతి చేస్తే జీవితం బుద్ధి చెబుతుందన్న విషయం మర్చిపోకూడదు” అంటూ రెడిట్‌లో పోస్టు పెట్టాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.