ఇతనింట్లో అక్షయ పాత్ర ఏం లేదు.. అయినా కానీ నోట్ల కట్టలు వస్తూనే ఉన్నాయ్..

నోట్ల కట్టలు.. అది కూడా అన్నీ ఐదు వందల నోట్లే.. ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో దొరికిన నగదు ఇది.


ఒకట్రెండు కాదూ దాదాపు రెండు కోట్ల రూపాయల నోట్లు దొరకడం అధికారుల్ని అవాక్కయ్యేలా చేసింది. శాంతాను మహాపాత్ర.. జలవనరులశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. మహాపాత్ర నివాసంతో పాటు కార్యాలయంలోనూ సోదాలు చేశారు. పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టలు చూసి షాకయ్యారు. ఆ తర్వాత షాక్ నుంచి తేరుకుని వాటిని లెక్కించడం షురూ చేశారు. చేతులతో లెక్కింపు అయ్యే పని కాదని.. ఏకంగా కౌంటింగ్ మెషిన్ తెప్పించారు. కౌంటింగ్‌లో 1.97 కోట్లుగా నోట్ల లెక్క తేల్చారు అధికారులు. క్యాష్‌తో పాటు గోల్డ్‌ కూడా సీజ్ చేశారు.

అలాగే కార్లు, బీమా, డిపాజిట్లు, పెట్టుబడులకి సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించారు. వాటి వాల్యుయేషన్‌ లెక్కగట్టే పనిలోపడ్డారు. భారీ మొత్తంలో చర, స్థిరాస్తుల్ని కూడబెట్టినట్టు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. వీటన్నింటిని మహాపాత్ర ఎలా సంపాదించారు..? ఏయే మార్గంలో కూడబెట్టారన్న కోణంలో కూపీ లాగుతున్నారు. మహాపాత్ర బంధువులు నివసించే మల్కన్‌గిరి, కటక్‌, భువనేశ్వర్‌ సహా ఏడు ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, పది మంది ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు ఏఎస్సైలు సోదాల్లో పాల్గొన్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతాయన్నారు అధికారులు.