ఏపీలో రేషన్ లబ్ధిదారులకు మరో ఉపశమనం..! మంత్రి కీలక సూచనలు

పీలో రేషన్ పంపిణీ వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కూటమి సర్కార్ లబ్దిదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రేషన్ పంపీణీకి వినియోగిస్తున్న వాహనాల్ని సైతం పక్కనబెట్టి షాపుల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తున్నా ఇంకా సర్వర్ సమస్యలు, ఇతరత్రా కారణాలతో లబ్దిదారులకు అందకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం డీలర్లకు కీలక ఆదేశాలు ఇచ్చింది.


తాజాగా ఏలూరులో రేషన్ షాపుల్ని పరిశీలించిన పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ ఆదేశం ఇచ్చారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ పంపిణీలో లబ్దిదారుల నిర్ధారణ కోసం బయోమెట్రిక్ పరికరాల్ని వాడుతున్నారు. ఇవి కనెక్ట్ అయి ఉన్న సర్వర్లు పనిచేయడం లేదనే కారణంతో పలు చోట్ల రేషన్ సరుకుల్ని లబ్దిదారులకు ఇచ్చేందుకు డీలర్లు నిరాకరిస్తున్నారు. సర్వర్ పనిచేయడం లేదని చెప్పి వెనక్కి పంపేస్తున్నారు. దీంతో లబ్దిదారులు పలుమార్లు రేషన్ షాపులకు తిరగాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. దీన్ని గమనించిన మంత్రి నాదెండ్ల మనోహర్ వాటితో సంబంధం లేకుండా రేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు.

రేషన్ పంపిణీలో సర్వర్ సమస్యలు ఎదురైనా.. పంపిణీని మాత్రం ఆపొద్దని ఆయన డీలర్లకు ఆదేశాలు ఇచ్చారు. దీనికి ప్రత్యామ్నాయంగా లబ్దిదారుడి ఫొటో తీసుకుని, సంతకం చేయించుకుని రేషన్ ఇచ్చి పంపాలని ఆదేశించారు. అంతే కానీ రేషన్ ఆపేందుకు మాత్రం వీల్లేదన్నారు. దీంతో ఇకపై సర్వర్ సమస్యలతో సంబంధం లేకుండా రేషన్ పంపిణీ చేసేందుకు మార్గం సుగమం కానుంది. ఇప్పటికే డీలర్లు తమ పరిధిలోని రేషన్ లబ్దిదారుల డేటాను నిర్వహిస్తున్నారు. వారి వివరాలతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా రేషన్ పంపిణీని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.