AP secretariats: ఏపీ ప్రభుత్వం ( AP government )ప్రజలకు కీలక సమాచారం ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయడం హాట్ టాపిక్ గా మారింది.
జూన్ 10 మంగళవారం రాత్రి వరకు సేవలను నిలిపివేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే సాంకేతిక అంశాలతోనే ఈ సేవలకు అంతరాయం కలుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగులు ప్రచారం చేస్తున్నారు. సేవలు నిలిచిపోతాయని ముందుగానే ప్రజలకు సూచించారు. అయితే ఇది ఒక హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ సాగుతోంది. ఇంకోవైపు విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులకు దృవపత్రాలు అవసరం అవుతాయి. ఇటువంటి సమయంలో ఆన్లైన్ సేవలు నిలిపివేయడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
* డేటా మార్పిడితోనే..
ప్రస్తుతం ఏపీ సేవా పోర్టల్ ను( AP seva portal ) మైక్రోసాఫ్ట్ క్లౌడ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ డేటా సెంటర్కు మై గ్రేట్ అవుతోంది. ఈ డేటా మార్పిడి ప్రక్రియ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో కొన్ని ముఖ్యమైన ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు అని అధికారులు ముందుగానే వెల్లడించారు. ముఖ్యంగా తాత్కాలికంగా నిలిచే ముఖ్యమైన సేవలపై స్పష్టతనిచ్చారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం, సమగ్ర ధ్రువీకరణ పత్రం, భూమి మ్యూటేషన్లు, ఇళ్ల స్థలాల దరఖాస్తులు, వృద్ధాప్య ధ్రువీకరణ పత్రం, వివాహ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు సంబంధిత సేవలు, రెవెన్యూ సేవలు, వాటర్ ట్యాక్స్, ప్రాపర్టీ టాక్స్ పేమెంట్లు, పట్టణ పరిపాలన శాఖ సేవలు, మత్స్య శాఖ సేవలు నిలిపి వేస్తున్నట్లు చెప్పింది. అయితే ఈ ధ్రువీకరణ పత్రాల కోసం సచివాలయాలకు వెళ్తున్న వారికి నిరాశ ఎదురవుతోంది.
* యధాతధంగా ఇతర ప్రభుత్వ సేవలు..
అయితే ఇది తప్పకుండా చేయాల్సిన మార్పు అని… మంగళవారం రాత్రి నుంచి యధాతధంగా సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఆన్లైన్ మార్పుల ప్రభావం అన్ని ప్రభుత్వ సేవలపై ఉండదని కూడా అధికారులు చెబుతున్నారు. ఆధార్ అప్డేట్స్( Aadhar updates ), బ్యాంకు సేవలు, పలు కేంద్ర ప్రభుత్వం స్కీములు, నాన్ రెవెన్యూ ఆధారిత సేవలు వంటి కొన్ని సేవలు మీ సేవ కేంద్రాల్లో యధావిధిగా అందుబాటులోకి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పనుల కోసం ముందుగానే అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లేదా అప్లికేషన్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతరాయం ముగిసిన వెంటనే సేవలు మళ్లీ పూర్వస్థితికి తీసుకొస్తామని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి అయితే సచివాలయాల సేవలకు అంతరాయం కలుగుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.