ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం పథకాల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన అన్నదాత సుఖీభవ అమలు మూడు విడతల్లో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులు ఏడాదిలో మూడు విడతలు గా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెలలో పీఎం కిసాన్ నిధుల విడుదల ముహూర్తం ఖరారు అయింది. అదే రోజున అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. అయితే, మార్గదర్శకాలను దాదాపు ఖరారు చేసారు.
20న రైతుల ఖాతాల్లో నిధుల జమ
రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం అమలు ముహూర్తం ఖరారైంది. ఈ పథకం కోసం రాష్ట్రంలోని 45.71 లక్షల మంది రైతులను అర్హులుగా తేల్చారు. వీరికి ఏడాదికి రూ 20 వేలు చొప్పున మూడు విడతల్లో జమ చేయనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 20వ తేదీన ఒక్కో రైతుకు రూ 2 వేలు విడుదల చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ నిధులతో పాటుగానే అన్నదాత సుఖీభవ తొలి విడతగా రూ 5 వేలు జమ చేయనుంది. దీని ద్వారా రెండు పథకాల ద్వారా రైతుకు ఈ నెల 20న తొలి విడతగా రూ 7 వేలు అర్హత పొందిన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కేంద్రం ఈ తేదీ మార్పు చేస్తే.. ఏపీ ప్రభుత్వం సైతం నిధుల జమ తేదీ మారే అవకాశం ఉంది.
మూడు విడతల్లో
రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రెండో విడతలుగా అక్టోబర్ లో రూ 5 వేలు, మూడో విడతగా వచ్చే జన వరి లో రూ 4 వేలు కేంద్రం పీఎం కిసాన్ నిధులతో కలిపి జమ చేయనుంది. కాగా, కమతాల వారీగా చూస్తే రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో ప్రజా ప్రతినిధులు, వ్యవసాయేతర అవసరాలకు భూములను వినియోగించే వారిని మినహాయించారు. మొత్తం 79 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవ పరిథిలోకి వస్తారని రైతు సేవా కేంద్రాల ద్వారా స్పష్టత వచ్చింది. కుటుంబాన్ని యూనిట్ గా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఆరంచెల వడపోత తరువాత 45.71 లక్షల కుటుంబాలను అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా తేల్చారు. ఈకేవైసీ పూర్తి చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.
కౌలు రైతులకు అప్పుడే
అదే విధంగా అటవీ భూములకు పట్టాలు పొందిన రైతులకు ఈ సాయం అందనుంది. ఇక, కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో కొందరికి కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. పంటకాలం మొదలైన తరువాత వారిని గుర్తించి, జాబితాలు తయారు చేయాలని నిర్ణయించారు. తరువాత వారికి అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన వారితో పాటుగా ఆర్దిక సాయం అందించనుంది. ఇక, ఇప్పటికే బడ్జెట్ లో నిధులు కేటాయించటంతో.. ఈ నెలలోనే అర్హత ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు ఖాయంగా కనిపిస్తోంది.