నీట్‌కు అపార్ తప్పనిసరి.. విద్యార్థులు ముందుగా చేయాల్సినవి ఇవే..

వైద్య విద్య కళాశాలలో సీటు దక్కించుకునేందుకు ప్రతీ ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష నీట్‌. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌. ఈ పరీక్షను ఎన్‌టీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.


అయితే, ఈసారి పరీక్షకు హాజరైయ్యే విద్యార్థులు తమ వెంట కేవలం వారి హాల్‌టికెట్‌ను మాత్రమే కాదు. మరో ఏర్పాటు కూడా చేశారు వైద్య విద్య శాఖ అధికారులు. అయితే, గతంలో కొన్నిసార్లు ఈ నీట్ పరీక్ష జరగాల్సిన సమయంలో ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి, అప్పుడు ఎన్ని అల్లర్లు జరిగాయో, ఎన్ని విమర్శలు తలెత్తాయో అందరికీ తెలిసిందే.

దీంతో, అధికారులు మరింత అప్రమత్తం అయ్యి, ఈసారి నుంచి ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా ఉండేలా మరిన్ని జాగ్రత్తలు పాటిస్తూ, అపార్ కార్డులను ప్రారంభించారు. నిజానికి, అపార్ కార్డులు ఇప్పుడు తీసుకొచ్చింది కాదు. కాని, నీట్ పరీక్షకు తీసుకురావడం మాత్రం ఇదే తొలిసారి. అయితే, విద్యార్థులంతా పరీక్షకు హాజరైయ్యే సమయంలో వారి హాల్‌టికెట్లను, ఆధార్ కార్డును, అపార్ కార్డును వెంట తీసుకురావాలని ప్రకటించింది ఎన్‌టీఏ.

ఈ అపార్ కార్డులకు ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని, నీట్ పరీక్షకు చేసుకునే దరఖాస్తుల్లో మీ అపార్ వివరాలను నమోదు చేయాలి. ఇలా చేస్తేనే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఉన్నత విద్యామండలి జారీ చేసిన గైడ్‌లైన్స్‌ ప్రకారం.. ఈసారి ఆధార్‌ అథెంటికేషన్ తప్పనిసరని ఎన్‌టీఏ తెలిపింది. అలాగే అపార్ ఐడీని నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్‌తో అనుసంధానించనున్నట్లు వెల్లడించింది. అందుకే ఆధార్‌లో తాజా సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాలని సూచించింది. అప్లికేషన్‌, ఎగ్జామినేషన్ ప్రాసెస్‌లో అపార్ ఐడీ, ఆధార్‌ అథెంటికేషన్‌ను స్టూడెంట్స్‌ ఉపయోగించాల్సి ఉంటుందని పేర్కొంది. దీనివల్ల వెరిఫికేషన్‌, రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ సులభమవుతుందని, ఎగ్జామ్‌లోనూ ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదని తెలిపింది.

అపార్ ఐడీ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఐడీ) అనేది ‘వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడి’ ఇనీషియేటివ్ కింద భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. ఒక స్టూడెంట్‌కు సంబంధించిన అకడమిక్ రికార్డ్స్ అన్నీ అపార్ ఐడీకి లింక్ అవుతాయి. అపార్‌ ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ఎగ్జామినేషన్‌ ప్రక్రియ ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తవుతుంది. వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ను సులభం చేయటంతో పాటు ఎలాంటి మోసం, అవకతవకలు జరగకుండా చూసుకోవచ్చు. ఆధార్‌ను ప్రైమరీ ఐడెంటిఫయర్‌గా వాడుకొని ఎగ్జామినేషన్‌ అథారిటీస్‌ సైతం విద్యార్థులను సులభంగా గుర్తించేందుకు వీలుంటుంది.

1. ఆధార్‌ అప్‌డేట్‌: నీట్ అభ్యర్థులు వారి ఆధార్‌లో ఉండే వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. వారి పేరు, పుట్టిన తేదీ వంటివి 10th క్లాస్‌ సర్టిఫికెట్స్‌లో ఉన్నట్లే ఉండాలి. అందులో మిగితా వివరాలను కూడా క్షున్నంగా పరిశీలించాలి.

2. ఆధార్‌తో మొబైల్‌ నెంబర్‌ లింక్‌: మీ ఆధార్‌ను మొబైల్‌ నెంబర్‌తో లింక్‌ చేయాలి. అప్లికేషన్‌, ఎగ్జామినేషన్‌ ప్రాసెస్‌లో ఓటీపీ బేస్డ్ అథెంటికేషన్‌కు ఇది తప్పనిసరి.

3. ఫేషియల్‌ రికగ్నిషన్‌: ఆధార్‌లో యూఐడీఏఐ ఫేషియల్‌ రికగ్నిషన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీన్ని మరోసారి అప్‌డేట్‌ చేసుకుంటే ఎగ్జామ్‌ హాల్‌లోకి ఎంటర్‌ అయ్యేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఈ విషయంలో ఎలాంటి సందేహాలున్నా, అదనపు సమాచారం కావాలన్నా హెల్ప్‌డెస్క్‌ నెంబర్‌ 011-40759000కు ఫోన్‌ చేయాలని NTA సూచించింది. neetug2025@nta.ac.inకి ఈమెయిల్‌ చేయాలని తెలిపింది. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌, ఆధార్‌ అనుసంధానం.. ఇలా ఎలాంటి అనుమానాలున్నా వీటి ద్వారా సంప్రదించాలని సూచించింది.