అంతర్జాతీయంగా పూతరేకుల తయారీకి గుర్తింపు పొందిన ఆత్రేయపురం పూతరేకులు తింటున్నారా? మీరు డేంజర్ పడ్డట్టే! ఎంతో ఇష్టంగా తినే పూతరేకుల్లో కల్తీ నెయ్యి వాడుతున్నారు.
ఈ విషయం తెలుసా? అధికారులు చేసిన దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని నెలలుగా కల్తీ నెయ్యి వినియోగించి పూతరేకులు తయారుచేస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అలాంటి వారి ఆటను అధికారులు కట్టడి చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజవర్గం ఆత్రేయపురం పూతరేకులకు ప్రఖ్యాతి గాంచిన విషయం తెలిసిందే. ఆత్రేయపురం పూతరేకులకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు కల్తీరాయుళ్లు మోసానికి పాల్పడుతున్నారు. కల్తీ నెయ్యి వినియోగిస్తుండడాన్ని పట్టుకున్నారు. 880 కిలోల కల్తీ నెయ్యిని స్థానికులు పట్టుకుని రెవెన్యూ, పోలీసులకు అప్పగించారు.
ఆత్రేయపురంలో శ్రీ లక్ష్మీ డ్రై ఫుడ్స్ షాపులో 110 కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేస్తుండగా స్థానికులు గుర్తించారు. వెంటనే దానిని స్వాధీనం చేసుకొని రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇలాంటి కల్తీ నెయ్యి ఉదంతం వెలుగులోకి వచ్చింది. షణ్ముఖ డిస్పోజబుల్ ముడి సరకు అమ్మకందారుడు, ఆత్రేయ డ్రైఫ్రూట్స్, నెయ్యి విక్రయదారుడు, శివపార్వతి పాలకోవ, పూతరేకుల తయారీదారుల నుంచి నమూనాలు సేకరించగా కల్తీ నెయ్యిగా నిర్ధారణ అయ్యింది. ఆహార పదార్థాల్లో నిబంధనలకు విరుద్ధంగా కల్తీ నెయ్యి వాడకంపై ఆయా షాపుల యజమానులపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.
ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ షాపులకు సరఫరా చేసే నెయ్యి ప్యాకెట్‌లపై తయారు చేసిన తేదీ లేకుండా కల్తీనెయ్యియ్య సరఫరా చేస్తే దుకాణాల లైసెన్సులు రద్దుచేస్తామని, కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. రెండు నెలలు తిరగకుండానే తిరిగి ఆత్రేయపురంలో పూతరేకులు తయారీ కేంద్రాలకు కల్తీ నెయ్యి సరఫరా అవుతుండడంతో పూతరేకుల ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కొందరి వలన ఆత్రేయపురం పూతరేకులకు చెడ్డపేరు తీసుకువస్తున్నారని అక్కడి పూతరేకుల తయారీదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.