ఏపీలోని బెలూం గుహలకు ‘భౌగోళిక వారసత్వ’ గుర్తింపు

బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ గుర్తింపు దక్కింది. ఇవి నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో ఉన్నాయి. ఈ గుర్తింపు దక్కడం పట్ల రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఏపీలోని ప్రఖ్యాత బెలూం గుహలకు సరికొత్త గుర్తింపు దక్కింది. భౌగోళిక వారసత్వ ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తింపునిచ్చింది. దేశంలోనే అత్యంత పొడవైన గుహలుగా ఇప్పటికే బెలూం గుహలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ప్రతి ఏడాది కూడా ఇక్కడికి లక్షల సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు.


మరింత ప్రచారం కల్పిస్తాం – టూరిజం మంత్రి దుర్గేశ్

భౌగోళిక వారసత్వ జాబితాలో ప్రఖ్యాత బెలూం గుహలకు గుర్తింపు దక్కడంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. కొలిమిగుండ్లలోని బెలూం గుహలకు జీఎస్ఐ ప్రత్యేక గుర్తింపునివ్వడం సంతోషమన్నారు.

“పురాతన సంస్కృతీ నిలయాలు ఈ బెలూం గుహలు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటనతో పర్యాటకంగా మరింత ప్రాచుర్యం లభిస్తుంది. జీఎస్ఐ జాబితాలో చోటు దక్కడం వల్ల బెలూం గుహలు మరింత అభివృద్ధికి నోచుకోనున్నాయి. ప్రపంచలో రెండోది, దేశంలోనే పొడవైన అంతర్భాగ గుహలుగా బెలూం గుహలు ప్రసిద్ధి. దేశ పర్యాటక ప్రదేశాల్లో రాష్ట్రంలోని బెలూం గుహలకు స్థానం దక్కుతుంది” అని మంత్రి దుర్గేష్ అభిప్రాయపడ్డారు.

విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ గుహలకు మరింత ప్రచారం కల్పిస్తామని మంత్రి దుర్గేశ్ అన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని చెప్పారు.

మనందరికీ గర్వకారణం – మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

బెలూం గుహలకు ”భౌగోళిక వారసత్వ” గుర్తింపుపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భౌగోళిక వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందడంతో దేశ పర్యాటక ప్రదేశాల పటంలో బనగానపల్లె నియోజకవర్గం నిలుస్తుందన్నారు. బెలూం గుహలకు స్థానం దక్కడం మనందరికీ గర్వకారణమని చెప్పారు.

“ప్రపంచంలో రెండో అతిపెద్ద, దేశంలో పొడవైన గుహలుగా ప్రసిద్ధి చెందిన బెలూం గుహలకు భవిష్యత్తులో మరింత ప్రాచుర్యం కల్పించే విధంగా అభివృద్ధి చేస్తాం. అధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు నెలవైన బనగానపల్లె నియోజకవర్గం, నంద్యాల జిల్లాలను టూరిజం హాబ్ గా తీర్చిదిద్దేందుకు తోడ్పాటు అందిస్తాం” అని తెలిపారు.

“ప్రతి ఏటా లక్షల మంది పర్యాటకులు వచ్చే బెలూం గుహలను పర్యాటక ప్రాంతంగా మరింతగా అభివృద్ధి చేస్తాం. తద్వారా స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి క్రీ.పూ 450 ఏళ్ల కిందటి ఈ పురాతన గుహాలకు.. పర్యాటకంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తాం. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా టూరిజం శాఖ ద్వారా బెలూం గుహలకు మరింత ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తాం” అని మంత్రి జనార్థన్ రెడ్డి ఓ ప్రకటన ద్వారా వివరించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.