వాషింగ్టన్: అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన వారిని తిరుగుటపాలో పంపించేయక తప్పదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కొన్ని లక్షలమందిలో గుబులు రేకెత్తిస్తోంది. గడ్డ కట్టిస్తున్న చలి కంటే ఇది వారిని ఎక్కువగా వణికిస్తోంది. తాత్కాలిక వీసాలపై వచ్చినవారిదీ ఇదే పరిస్థితి. సరైన పత్రాల్లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారు దాదాపు 1.40 కోట్లమంది ఉంటారని అంచనా. వీరిలో భారతీయులు సుమారు 7.25 లక్షల మంది. మెక్సికో, సాల్వెడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే. ఎన్నికల ప్రచారం నుంచి ఇలాంటివారి విషయంలో పదేపదే తన వైఖరిని ట్రంప్ చెబుతూ వచ్చారు. బాధ్యతలు చేపట్టాక స్పష్టమైన అధికారిక ఆదేశాలు జారీచేశారు. అధ్యక్షుడిగా బైడెన్ ఉన్నప్పుడు గత ఏడాది వివిధ దేశాలవారి మాదిరిగా 1,529 మంది భారతీయులు కూడా ఈ కారణాలతోనే స్వదేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ట్రంప్ రావడంతో పరిస్థితి ఇంకా తీవ్రమవుతుందనే ఆందోళన మొదలైంది. ఒక యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుని, సరిహద్దులు దాటి అగ్రరాజ్యంలోకి వచ్చేందుకు ఇదివరకు వీలుండేది. కొత్త సర్కారు దీనికి చెల్లుచీటీ రాసింది.
జన్మతః లభించే పౌరసత్వంలోనూ కోత
అమెరికా గడ్డపై పుట్టిన ఇతర దేశాలవారికి జన్మతః లభించే పౌరసత్వాన్ని రద్దుచేయాలని ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులిచ్చారు. దీనివల్ల భారతీయులకు ఎక్కువ ఇబ్బంది కానుంది. అమెరికా జనాభాలో సుమారు 50 లక్షల (1.47 శాతం) మంది భారతీయులే. వీరిలో మూడోవంతు మంది అమెరికాలో పుట్టినవారు. మిగతావారంతా వలసదారులు. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి, గ్రీన్‌కార్డుకోసం వేచిచూస్తున్నవారికి పుట్టిన సంతానానికి అమెరికా పౌరసత్వం లభించదు. పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలన్న ఉద్దేశంతో చాలామంది భారతీయులు కాన్పు సమయానికి అమెరికా వెళ్లిపోతుంటారు. ఇకపై దీనికి బ్రేక్ పడనుంది. బిడ్డ తల్లి అమెరికాలో అక్రమంగా ఉంటున్నా, తండ్రి అమెరికా పౌరుడుగానీ, చట్టబద్ధ శాశ్వతనివాసి గానీ కాకపోయినా ఆటోమేటిక్ పౌరసత్వం రాదు. కాన్పు సమయంలో బిడ్డ తల్లి అమెరికాలోనే చట్టబద్ధంగా ఉన్నా, అది తాత్కాలిక ప్రాతిపదికన అయినప్పుడు (ఉదాహరణకు విద్యార్థి వీసా, పర్యాటక వీసాపై రావడం వంటివి) కూడా ఇది రాదు.
అమెరికా ప్రజలకూ ఇబ్బందే
నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడం దాదాపు అసాధ్యం. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువమంది భారతీయులే. వీరిలో కొందరు ఇతర దేశాలకు చెందినవారిని అక్కడే వివాహం చేసుకుంటారు. ఇలాంటివారు ఇకపై పిల్లల పౌరసత్వం విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.