జగన్ హయాంలో చెలరేగిపోయిన రాజ్యాంగేతర శక్తి, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ హైకోర్టు ఆదేశాలను ధిక్కరించాడు. తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని, తప్పుడు మెడికల్ సర్టిఫికెట్‌తో హైకోర్టుకే టోకరా వేసి మధ్యంతర బెయిలు పొడిగించుకున్న సంగతి తెలిసిందే. బెయిలు గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసిపోయింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అతడు ఆ సమయంలోపు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో లొంగిపోవాల్సి ఉంది. కానీ, మళ్లీ బెయిలు పొడిగించాలంటూ మంగళవారం తన న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించాడు. అదేం కుదరదని… సాయంత్రంలోపు అతను జైలులో లొంగిపోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా… బోరుగడ్డ తన అజ్ఞాతం వీడలేదు. ‘‘హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బెయిల్ గడువు ముగిసేలోపు బోరుగడ్డ అనిల్ జైలుకు వచ్చి లొంగిపోలేదు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు, పైఅధికారులకు తెలియచేశాం’’ అని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. సాయంత్రం 5 గంటల్లోపు చెన్నై నుంచి విమానంలో వచ్చయినా జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవలసిందేనని హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. గ్రేస్ పీరియడ్ అరగంట కలుపుకొని సాయంత్రం 5.30 గంటలు దాటినా బోరుగడ్డ జైలుకు రాలేదు.
ఎక్కడున్నాడు?
హైకోర్టును బురిడీ కొట్టించి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన బోరుగడ్డ ఎక్కడున్నాడో పోలీసులకూ అంతుచిక్కడంలేదు. తల్లికి అనారోగ్యం పేరిట గతనెల 14వ తేదీన తొలిసారి బోరుగడ్డ మధ్యంతర బెయిలు పొందాడు. ఆ తర్వాత… దానిని పొడిగించుకునేందుకు నకిలీ మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాడు. గత నెల 23వ తేదీనే ఆయన తల్లి పద్మావతి చెన్నై అపోలో నుంచి డిశ్చార్జి అయ్యారు. అంతకుముందుగానీ, ఆ తర్వాత గానీ బోరుగడ్డ తన తల్లితో లేరని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏది ఏమైనా… హైకోర్టు ఆదేశాల ప్రకారం మంగళవారం సాయంత్రానికి అతను జైలులో లొంగిపోవాలి. బోరుగడ్డ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో సంచరించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అక్కడ అతడికి వైసీపీకి చెందిన ముఖ్య నేత ఒకరు సహకరించినట్లు అనుమానిస్తున్నారు. బోరుగడ్డపై 4నెలల కిందటే లుక్‌అవుట్ నోటీసు జారీ అయ్యింది. అంటే… దేశంలోని విమానాశ్రయాల నుంచి ఎక్కడికీ పారిపోయే అవకాశంలేదు. ఈ నేపథ్యంలో… రోడ్డు మార్గంలో నేపాల్ లేదా ఇతర దేశాలకు పారిపోయే అవకాశముందని అనుమానిస్తున్నారు. మరోవైపు… తన ‘నకిలీ లీలలు’ బయటపడినప్పటికీ బోరుగడ్డ వీడియో విడుదల చేసి ప్రభుత్వంపై బెదిరింపులకు దిగాడు. ఇది విడుదల చేసి నాలుగు రోజులైనప్పటికీ… అది ఎక్కడి నుంచి, ఎవరి ఫోన్‌లో రికార్డు చేశారనే విషయాన్ని పోలీసులు ఇప్పటికీ గుర్తించలేదు. ఇప్పుడు బోరుగడ్డ కోసం గుంటూరు, అనంతపురం పోలీస్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అతడికి ఎవరు సహకరిస్తున్నారు? బ్యాంక్ ఖాతాల లావాదేవీలు, కుటుంబ సభ్యుల కదలికలు, వారి సెల్‌ఫోన్‌లు, గతంలో బోరుగడ్డ ఎవరెవరితో టచ్‌లో ఉన్నాడు, రాజమండ్రి కారాగారం నుంచి ఎవరెవరితో మాట్లాడాడు… వంటి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. బోరుగడ్డతోపాటు ఆయన తల్లి, కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా స్విచ్‌ఆ్‌ఫలోనే ఉండటం గమనార్హం. ముందస్తు ప్రణాళికలో భాగంగానే కుట్రపూరితంగా బోరుగడ్డ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు అంచనాకు వచ్చారు.
జామీనుదారుల పరిస్థితేంటి?
బోరుగడ్డ జైలుకు తిరిగి రాకపోవడంతో అతడికి జామీను ఇచ్చిన ఇద్దరు వ్యక్తులూ కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అతడు మొదటిసారి మధ్యంతర బెయిల్‌పై వెళ్లినప్పుడు తన బావమరిది, మరొక సంబంధీకుడిని పూచీకత్తులుగా చూపించాడు. బెయిల్ పొడిగింపు లభించాక..పూచీకత్తు ఇవ్వడానికి వచ్చిన వాళ్లు తెలంగాణ వారు కావడం, వారిలో ఒకరి ఫోన్ నంబరు డయల్ చేయగా ట్రూకాలర్‌లో ఆధార్‌కు భిన్నమైన పేరు రావడంతో హైదరాబాద్ పోలీసులకు జైలు అధికారులు సమాచారమిచ్చి పూచీకత్తులను తిరస్కరించారు. దీంతో హడావుడిగా తూర్పుగోదావరి జిల్లా ఉండేశ్వరపురం కొత్తకాలనీకి చెందిన వేమగిరి శేషగిరి, కొక్కిరిపాటి అబ్బులును చూపించారు. వీరిద్దరికీ బోరుగడ్డతో పరిచయమే లేదు. వీరిలో ఒకరు ఆటో డ్రైవరు.. మరొకరు న్యాయవాది గుమాస్తా అని తెలుస్తోంది. వీళ్లకు మధ్యాహ్నం జైలు అధికారి ఫోన్ చేయగా.. ఒకరు తనకు సంబంధం లేదని సమాధానమివ్వగా, మరొకరు ఫోన్ కాల్‌కు స్పందించలేదని తెలిసింది.
ఆ ఇద్దరికీ ఇబ్బందే!
‘బోరుగడ్డ అనిల్ ఎవరో తెలియని వ్యక్తులు అతడికి జామీను ఇచ్చారు. కోర్టు ఆదేశాల ప్రకారం అతడు తిరిగి జైలుకు రాకపోతే వారే ఇబ్బందిపడతారు. వారిని ప్రాసిక్యూట్ చేయాల్సి రావొచ్చు. బోరుగడ్డపై ఇప్పటికే ఉన్న కేసులకు అదనంగా కోర్టు ధిక్కారం, ఆదేశాలను బేఖాతరు చేయడం, ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించడం తదితర కేసులు కూడా నమోదవుతాయి. తప్పుడు పత్రాల సమర్పణలో న్యాయవాది పాత్ర ఉంటే ఆయనా చట్టానికి అతీతుడేమీ కాదు.’