ఓ వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన శుక్రవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహిళను తలపై రాయితో మోది ఎవరూ గుర్తుపట్టకుండా ముఖంపై హిరోసిన్ పోసి తగలబెట్టారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన మేడ్చల్ జోన్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునీరాబాద్ గ్రామ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు బై పాస్ అండర్ బ్రిడ్జి కింద మంటల్లో కాలిన యువతి మృతదేహం ఉందని మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే మేడ్చల్ సీఐ అద్దాని సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పలు వివరాలను సేకరించారు.
హత్యకు గురైన వివాహిత వయస్సు సుమారు 25 నుండి 30 సంవత్సరాలుగా ఉంటుందని తెలిపారు. తలపై రాయితో మోది నిప్పంటించడంతో మొహం మొత్తం కాలిపోయిందన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. వివాహిత చేతి పై శ్రీకాంత్ అని తెలుగులో, నరేందర్ అని ఇంగ్లీష్ లో టాటూ ఉందని తెలిపారు. వివాహిత మెడలో రోల్ గోల్డ్ చైన్ ఉందన్నారు. కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ముఖం కాలిపోయిందని చెప్పారు. యువతిని హత్య చేసి కాల్చి వేసినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు ఏసీపీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని, త్వరలోనే అన్ని విషయాలను తెలియజేస్తామని పేర్కొన్నారు.